పదేళ్ల పాటు కిందా మీదా పడి పని చేసిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత బోడి మల్లన్నలాగా పక్కన పడేసిన జగన్ .. ఇప్పుడు నేను మారాను ప్లీజ్..నమ్మాలని వేడుకుంటున్నారు. తాడేపల్లిలో సమావేశం పెట్టిన ప్రతీ సారి జగనన్న 2.0 లో కార్యకర్తలకే పెద్ద పీట అంటున్నారు. అయినా ఎవరూ పట్టిచుకోకపోవడతో బుధవారం ఏకంగా బతిమాలుతున్నట్లుగా మాట్లాడారు.
కూటమి పాలన చూసి తాను మారిపోయానని తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కష్టపడి పని చేసిన కార్యకర్తలను ఉన్నత స్థానంలో కూర్చోబెడతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తాను ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారని అదే ప్రభుత్వంపై వ్యతిరేకతకు సంకేతమని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డిని నమ్ముకుని జైలుకు వెళ్తున్న వాళ్లు.. పరారీలో ఉన్న వాళ్లను చూస్తూ..చూస్తూ జగన్ రెడ్డి చెప్పే మాటలకు ఎవరైనా టెంప్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్య నేతలే తెరపైకి రావడం లేదు.
కార్యకర్తల్ని ఎలాగోలా రోడ్డుపైకి తేవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలోలా వాళ్లను వాడుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరూ బయటకు రావడం లేదు. ఓ పర్యటన పెట్టుకోవాలంటే.. చాలా ఖర్చు పెట్టి జన సమీకరణ చేయాల్సి వస్తోంది. బెట్టింగుల్లో నష్టపోయిన క్యాడర్ ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చెప్పుకుంటున్నారు కానీ.. జగన్ జనాల్లోకి రాలేకపోతున్నారు.