రాజకీయాల్లో పట్టుదల ఉండటం నాయకుడికి లక్షణమే కావొచ్చు, కానీ అదే పట్టుదల కుటుంబ వ్యవహారాల్లో ఈగో గా మారితే అది రాజకీయ భవిష్యత్తునే ప్రమాదంలో నెట్టేస్తుంది. ప్రజల్లో పరపతిని కోల్పోయేలా చేస్తుంది. ప్రస్తుతం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలతో సాగిస్తున్న ఆస్తుల యుద్ధం సరిగ్గా ఇదే బాటలో సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో చూపించే మొండితనాన్ని, సొంత రక్తసంబంధీకులపై ప్రదర్శించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కోర్టు మెట్లెక్కిన వివాదం – ఒక రాజకీయ తప్పిదం
తల్లి, చెల్లిపై జగన్ కోర్టుకు వెళ్లడం రాజకీయంగా ఆయన చేసిన అతిపెద్ద తప్పుగా భావించక తప్పదు. సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే తెలుగు సమాజంలో, ఒక కొడుకు తన తల్లిని కోర్టుకు లాగడం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలను పంపింది. తాజాగా విజయమ్మ దాఖలు చేసిన అఫిడవిట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. తన కుమారుడు కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని, కుటుంబ ఒప్పందాలను గౌరవించడం లేదని తల్లి స్వయంగా పేర్కొనడం జగన్ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య మాత్రమే కాక, విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా రూపాంతరం చెందింది.
ప్రజల్లో మారుతున్న ఇమేజ్
అక్కా చెల్లెమ్మల పక్షపాతిని అని చెప్పుకుంటూ అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాలను ప్రవేశపెట్టిన జగన్, ఇప్పుడు తన సొంత చెల్లికే ఆస్తిలో వాటా ఇచ్చేందుకు నిరాకరించడం విరోధాభాసగా మారింది. సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రంలోని సామాన్య మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారు.. అనే ప్రశ్నను ప్రత్యర్థులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ వివాదం వల్ల సామాన్య ప్రజల్లో జగన్ పట్ల ఉన్న సానుభూతి తగ్గి, ఆయనను ఒక కఠినమైన వ్యక్తిగా చూసే ప్రమాదం పొంచి ఉంది. తల్లిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారనే ప్రచారం గ్రామీణ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆస్తుల పట్టు.. రాజకీయ నష్టం!
ఆస్తుల విషయంలో పట్టు వీడకపోవడం వల్ల ఆర్థికంగా జగన్ బలోపేతం కావొచ్చు కానీ, రాజకీయంగా ఆయన కోల్పోయేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ఆస్తులు జగన్ కుటుంబానికి ఎలా వచ్చాయో ప్రజలందరికీ తెలుసు. ఆయన కష్టపడి సంపాదించారని నమ్మేవాళ్లు ఏపీలో ఉండరు. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈ అంశంపై ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతోంది. కుటుంబ వ్యవహారాలను నలుగురిలోకి రాకుండా పరిష్కరించుకోవడంలో విఫలమవ్వడం, జగన్ రాజకీయ చాణక్యతను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. జగన్ తన పంథాను మార్చుకోకుండా, ఈగోకు పోయి తల్లి, చెల్లితో పోరాటాన్ని కొనసాగిస్తే అది ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆస్తుల కంటే ప్రజాభిమానం ముఖ్యం అని గుర్తించి, పట్టువిడుపులతో ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఆయన విశ్వసనీయత మరింత దిగజారే ప్రమాదం ఉంది.
