వైఎస్ జగన్ వీకెండ్ కోసం బెంగళూరు వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లిపోవడం కామన్ గా మారింది. మళ్లి కుదిరితే మంగళవారం..లేకపోతే బుధవారం వస్తారు. అంటే .. వచ్చే రోజు.. పోయే రోజు తీసేస్తే మధ్యలో ఒక్క రోజు మాత్రమే తాడేపల్లిలో పార్టీ కార్యక్రమాల కోసం కేటాయిస్తున్నారు. మరీ పార్టీని ఇంత నిర్లక్ష్యంగా నడపడం ఏమిటన్న ఆశ్చర్యం వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.
జగన్ బుధవారం మధ్యాహ్నం వచ్చారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో మాట్లాడారు. తాను చెప్పాలనుకున్నది చెప్పారు. శుక్రవారం వెళ్లిపోయారు. ఈ మాత్రం దానికి బెంగళూరు నుంచి రావడం ఎందుకు అన్నది చాలా మందికి వస్తున్న ప్రశ్న. వచ్చిన రెండు రోజులు పార్టీ క్యాడర్ని అయినా..లీడర్ని అయినా కలిసేది ఉండదు. ఈ మాత్రం దానికే ఆయన ఓ రోజు.. తుపాన్ కారణంగా ఫ్లైట్ రద్దు అయిందని అందుకే రాలేకపోయారని ప్రకటించుకుని ట్రోలింగ్ కు గురయ్యారు.
జగన్ ఈ సారి ఇక్కడే ఉండి.. నష్టపోయిన పంటల పరిశీలనకు వెళ్తారని అనుకున్నారు. పంట నష్టం గురించి వీడియో కాన్ఫరెన్స్ లో గొప్పగా చెప్పారు. దీంతో ఎక్కడో చోటకు వెళ్తారని అనుకున్నారు. కానీ ఏ ప్రాంత నేతలు కూడా తమ ప్రాంతానికి రావాలని పిలవలేదని తెలుస్తోంది. ఆయనకూ వచ్చే ఉద్దేశం లేకపోవడంతో.. ఎవరైనా అడగాలని వారిని ఒత్తిడి చేయలేదు. అందుకే రానూ వచ్చారు…పోనూ పోయారన్నట్లుగా మారింది.
జగన్ రాకపోకల్లో ఎవరికి నష్టమంటే..దేవినేని అవినాష్ కే. వచ్చేటప్పుడు.. వెళ్లేటపప్పుడు జనాలను తీసుకెళ్లి జేజేలు కొట్టించే బాధ్యత ఆయనదే మరి.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                               
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                