చుట్టపుచూపుగా ఏపీకి వచ్చి పేపర్లు చూసి చదివే ప్రెస్మీట్లు నిర్వహించే జగన్మోహన్ రెడ్డి ఒకటే పాలసీ ప్రకారం వెళ్తున్నారు. ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే అది తన ఘనతేనని చెప్పుకోవడం… ఏదైనా చెడు ఉంటే అదంతా చంద్రబాబు వల్లేనని నిందలేయడం. బెంగళూరు బయలుదేరే ముందు గురువారం తాడేపల్లిలో ఇలాంటి ప్రెస్మీట్ నిర్వహించారు.
డీపీఆర్ లేకుండా, ఓ పద్దతి లేకుండా సీమ లిఫ్ట్ ను ప్రారంభించి ఎన్జీటీ ఆదేశాలతో ఆపేసిన ప్రాజెక్టును చంద్రబాబుకు ఆపాదించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడని అదే సాక్ష్యమని వాదించారు. కానీ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోపే పెద్దిరెడ్డి కంపెనీకి రూ. 900 కోట్ల వరకూ చెల్లింపులు చేసి నిలిపివేశారు. తర్వాత మూడున్నరేళ్ల కాలంలో ఎప్పుడూ అనుమతుల కోసం ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆపేశాడని అనుమతుల తీసుకురావడం లేదని అంటున్నారు. తెలంగాణ నిర్మించిన ఏ ప్రాజెక్టుకూ అనుమతిలేదని అందుకే సీమకూ లేదని వాదిస్తున్నారు. ఎన్జీటీ ఆదేశించినా పనులు చేశామని జగన్ ప్రకటించుకున్నారు. అదేమైనా సొంత ఇల్లా.. ప్లాన్ లేకుండా కట్టేసుకుని ఉండటానికి?
తన నిర్వాకంతో సీమ లిఫ్ట్ పనులు ఆగిపోతే.. దానికి చంద్రబాబును బాధ్యుడ్ని చేసి..చంద్రబాబు ఆలోచన చేసి.. పునాది వేసి.. అయిపోయే వరకూ వెంటపడిన భోగాపురం ఎయిర్ పోర్టు మాత్రం తన ఘనత అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం సిగ్గుపడలేదు. భూములతో ఆటలాడి..జీఎంఆర్ను వేధించి చివరికి అధికారంలో నుంచి దిగిపోయే ఏడాది ముందు రెండో సారి శంకుస్థాపన చేశారు. అయినా పనులు ముందుగు సాగలేదు. చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు పట్టుదలగా పూర్తి చేసేలా పరుగులు పెట్టించారు. అదికళ్ల ముందు ఉన్న నిజం. అయినా సిగ్గుపడకుండా క్రెడిట్ కోసం ఆరాటపడ్డారు.
జగన్ తన ప్రెస్మీట్ లో.. తన ఘనతలు అంటూ.. ప్రస్తుత ప్రభుత్వ విజయాలను.. తన పాలనా కాలంలో వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వ చేతకానితనం అని చెప్పడానికే సమయం కేటాయించారు. ఆర్థిక వృద్ధితో సహా అన్నీ అంతే. చివరికి అమరరాజా వంటి తెలుగు కంపెనీల్ని ఇతర రాష్ట్రాలకు తరిమేసి.. ఇప్పుడు పెట్టుబడులు వస్తూంటే.. చంద్రబాబు కమిషన్ల దాటికి ఎవరూ రావడం లేదని చెప్పుకొచ్చారు.
జగన్మోహన్ రెడ్డి ఓ మాయా ప్రపంచంలో ఉంటారు. ఆయనను వైసీపీ నేతలు, సజ్జల వంటి వారు అలాగే ఉంచుతారు. ప్రజలేమనుకుంటున్నారన్నది పట్టించుకోకుండా.. తాము అనుకునేది చెప్పుకుని .. అదే ప్రజలు నమ్ముతారని రాజకీయం చేస్తూంటారు. ఈ ప్రెస్మీట్ ఆసాంతం అదే రీతిలో జరిగింది.
