అనంతపురం జిల్లాలోని లక్షలాది మంది పేదల పాలిట కల్పవృక్షంలాంటి ఆర్డీటీ సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ పునరుద్ధరణపై జగన్ మోహన్ రెడ్డి స్పందించిన తీరు ఆయన బుద్ది ఇంత అల్పమా అని అందరూ అనుకునేలా చేస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న సేవా కార్యక్రమాలకు విదేశీ నిధుల అడ్డంకి తొలగిపోవడం ఒక శుభపరిణామం అయితే, దీనికి కూడా రాజకీయ రంగు పులిమి క్రెడిట్ కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ఆయన క్రెడిట్ ఫోబియా కు నిదర్శనంగామారింది.
ఆర్డీటీకి 2021లోనే ఈ లైసెన్స్ గడువు ముగిసినా, గత ప్రభుత్వ హయాంలో దీనిపై ఎటువంటి చొరవ తీసుకోలేదు. వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారనేది జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సేవా సంస్థలకు లైసెన్సులు ఇచ్చేముందు అత్యంత కఠినమైన నిబంధనలను పరిశీలిస్తుంది. గతంలో మదర్ థెరిస్సా సంస్థల వంటి దిగ్గజాలకు కూడా మత మార్పిడి ఆరోపణలు ఉన్నందున అనుమతులు నిరాకరించిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఆర్డీటీ విషయంలో మాంఛో ఫెర్రర్ కేవలం సేవకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మత మార్పిడులకు తావులేదని కేంద్ర హోంశాఖకు నివేదికలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఫాలోఅప్ చేసింది. ప్రతి దశలోనూ ఇంటెలిజెన్స్ నివేదికలను సానుకూలంగా పంపడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది.
అనుమతులు వచ్చిన వెంటనే సంస్థ అధినేత మాంఛో ఫెర్రర్ స్వయంగా చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలపడం ద్వారా ఈ విజయంలో ఎవరి పాత్ర ఉందో స్పష్టమైంది. అయినప్పటికీ, జగన్ రెడ్డి మాత్రం ఈ ఘనత క్రెడిట్ చోరీ అన్నట్లుగా ట్వీట్ చేయడం చూస్తుంటే, ఆయనకు మంచి పనుల పట్ల ఉన్న కుళ్లు, కుత్సిత బుద్ధి బయటపడుతోందని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాన్ని హుందాగా స్వాగతించాల్సింది పోయి, ఇతరులకు దక్కే కీర్తిని అపహరించాలని చూడటం నాయకత్వ లక్షణం కాదు.
ఒక ప్రాంతీయ సేవా సంస్థ మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా నెరవేర్చింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో కూడా రాజకీయ లబ్ధి వెతుక్కోవడం, అసత్య ప్రచారాలకు దిగడం వల్ల జగన్ రెడ్డి బుద్ది ఏమిటో అందరికీ తెలుస్తోంది.

