జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక కంపెనీ అయిన జగతి పబ్లికేషన్స్ సంస్థ కోర్టులో ఓ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ సారాంశం ఏమిటంటే దుబాయ్ ఖాతాలకు సంస్థకు చెందిన నిధులు బదిలీ చేయాల్సి ఉందని కానీ గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బ్యాంకులు అంగీకరించడం లేదని.. కొత్త ఖాతాను ఓపెన్ చేసుకుని ఆ డబ్బులను తరలించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరింది.
ఇలా డబ్బులు తరలించడానికి వారు కోర్టులో చెప్పిన కారణం కూడా విచిత్రంగా ఉంది. ఏకంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని వాడుకున్నారు. ఈ యుద్ధం కారణంగా.. అమెరికా ఆంక్షల కారణంగా న్యూస్ ప్రింట్ ను కొనుగోలు చేయడానికి డబ్బులు చెల్లించాల్సి ఉందట. విచిత్రం ఏమిటంటే.. న్యూస్ ప్రింట్ రోజూ అవసరమే. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏళ్లు గడుస్తోంది. ఇప్పుడే ఈ సమస్య ఎందుకు వచ్చింది?. ఇప్పటి వరకూ ఎలా న్యూస్ ప్రింట్ ను కొనుగోలు చేశారు?
గతంలోనే ఇలాంటి అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. అయితే కొత్తగా మళ్లీ పిటిషన్ వేసింది. సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. దుబాయ్ కు నిధులు పంపడానికి కొత్త ఖాతాలు అంటే..ఏదో తేడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రకటనలు, చందాల రూపంలో వందల కోట్లు ప్రజాధనం సాక్షి ఖాతాలో చేరిపోయింది. ఇప్పుడు ఆ ధనాన్ని దుబాయ్ కు పంపాలనుకుంటున్నారా..లేకపోతే ఇంకేదైనా ఉందా అన్నది వారికి మాత్రమే తెలియాలి. విదేశీ లావాదేవీలను అనుమతిస్తే ఆ తర్వాత వారు ఏం చేయగలరో అన్నీ చేసేయగలరు.
జగన్ అక్రమాస్తుల కేసులు ఏళ్లుగా ట్రయల్‌కు రావడం లేదు. అక్రమాస్తుల కేసుల్ని రకరకాల పిటిషన్లతో అడ్డుకుంటూ ఉండటంతో .. మెల్లగా తమ ఆస్తుల్ని విడిపించుకునేందుకు జగన్ అండ్ గ్యాంగ్ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పుడు అసలు శుక్రవారం కూడా కోర్టులో విచారణ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.
