విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపగలిగేది ఒక్క రాహుల్ గాంధీనేనని వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రైవేటీకరణ ఆగుతుందని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టి ఈ ప్రకటన చేశారు. ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టడానికే ఆయన విజయవాడ వెఎళ్లినట్లుగా ఉన్నారు.
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ వీరందరికీ కేంద్రంతో సంబంధాలు ఉన్నా, ఎంపీల బలం ఉన్నా స్టీల్ ప్లాంట్ను ఎందుకు కాపాడలేకపోతున్నారని జగ్గారెడ్డి అడుగుతున్నారు. మోడీతో దోస్తీ చేసిన జగన్, తన హయాంలో ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేదని నిలదీశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా కేవలం మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ మాత్రమే ప్రైవేటీకరణ ఆపగలరన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న నీటి ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగాలని జగ్గారెడ్డి సూచించారు. గతంలో కేసీఆర్, జగన్ ఇళ్లల్లో కూర్చుని చేపల పులుసు, కోడి కూర తిన్నారు తప్ప సమస్యలను పరిష్కరించలేదు. మా సీఎం రేవంత్ రెడ్డి అంత దిగజారి వ్యవహరించరన్నారు.
ఏపీకి వచ్చి ఇవన్నీ ఎందుకు చెబుతున్నారని చాలా మందికి అడిగే అవకాశం ఉంది. అందుకే దీనికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. విభజన సమయంలో ఏపీ విడిపోవద్దని చెప్పిన ఏకైక వ్యక్తిని నేనే, కాబట్టి ఇక్కడ మాట్లాడే పూర్తి హక్కు తనకు ఉందన్నారు. రాజకీయాలు చేస్తానని, ఏపీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
