తెదేపాలో చేరిన వైకాపా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఊహించని విధంగా వైకాపాకి అడ్డుగా దొరికిపోయారు. కృష్ణా పుష్కరాలకి వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికారులు విజయవాడలో అనేక ఆలయాలు కూల్చివేసినందుకు మిత్రపక్షమైన భాజపా, హిందూ మత పెద్దలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆలయాల కూల్చివేతపై వైకాపాయే మొదట నిరసనలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత అధికారులు రామవరప్పాడులో మశీదు కూల్చివేయడంతో వైకాపాకి మంచి అవకాశం లభించినట్లయింది. అందుకు ముస్లింలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు తారాపేటలోని మసీదు, ముస్లింల శ్మశానవాటికని తొలగించేందుకు అధికారులు సిద్దం అవుతుండటంతో వైకాపా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ముస్లిం నేతలని, కార్యకర్తలని రంగంలోకి దింపి, తెదేపాలో చేరిన జలీల్ ఖాన్ కి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించగలిగింది.
ఆయన నిన్న తారాపేట మసీదులో ప్రార్ధనలు చేయడానికి వచ్చినప్పుడు వైకాపా ముస్లిం నేతలు ఆయనని లోపలకి రానివ్వకుండా అడ్డుకొన్నారు. మత పెద్దలు సర్ది చెప్పడంతో జలీల్ ఖాన్ని లోపలకి అనుమతించారు. ఆ సందర్భంగా ఆయనపై వైకాపా ముస్లిం నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మసీదులు, ముస్లింల శ్మశానవాటికని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంటే, ఆయన నిమ్మకి నీరెత్తినట్లు చూస్తూ ఊరుకొన్నారని విమర్శించారు. తారాపేటలోని మసీదు, ముస్లింల శ్మశానవాటిక జోలికి వస్తే ఊరుకోబోమని ఆయనని హెచ్చరించారు.
జలీల్ ఖాన్ ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించకపోవడంతో షాక్ అయ్యారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి ‘ఆ మసీదుపై అధికారులు చెయ్యి వేస్తే తక్షణమే రాజీనామా చేస్తానని’ జలీల్ ఖాన్ ప్రకటించవలసి వచ్చింది. తెదేపాలో చేరిన తరువాత ఆయన జగన్మోహన్ రెడ్డిపై చాలా ఘాటుగా విమర్శలు చేశారు. వైకాపా అప్పుడేమీ చేయలేకపోయింది. కానీ అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని తెలివిగా అందిపుచ్చుకొని జలీల్ ఖాన్ కి చాలా సంకట పరిస్థితి కల్పించింది.
మిత్రపక్షమైన భాజపా అభ్యంతరాలనే ఖాతరు చేయకుండా ఆలయాలని తొలగిస్తున్న తెదేపా ప్రభుత్వం, వైకాపాలో నుంచి వచ్చి చేరిన జలీల్ ఖాన్ చెపితే వింటుందని అనుకోలేము. కనుక ఒకవేళ ఆ అధికారులు మసీదు, శ్మశానవాటికని తొలగించేందుకు సిద్దపడితే జలీల్ ఖాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారవుతుంది. రాజీనామా చేసినా చేయకపోయినా ఆయనే దెబ్బ అవుతారు.