ఉమ్మడికడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. నెంబర్ వన్ ఫ్యాక్షన్ నియోజకవర్గం. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య పోరాటం ఓ రేంజ్ లో ఉండేది. రాను రాను ఆ ఫ్యాక్షన్ హత్యలు కాస్తా.. రాజకీయ ఉద్రిక్తతలుగా మారాయి. హత్యలు తగ్గిపోయాయి.కానీ ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇప్పుడు జగన్ రెడ్డి మరోసారి పాత రాజకీయాలను గుర్తు చేసేందుకు సిద్ధమయ్యారు. జమ్మలమడుగు ఇంచార్జ్ రామసుబ్బారెడ్డిని నియమించారు.
పార్టీ మారిపోతారేమోనని ఇంచార్జ్ పదవి
జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి .. ఆదినారాయణరెడ్డితో పాటు బలం ఉంది. ఇద్దరూ సమ ఉజ్జీలే. కానీ వీరిద్దరూ టీడీపీలో చేరిన తర్వాత ఇద్దరూ ఓడిపోయారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో.. తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. టీడీపీకి అక్కడ నేత లేకుండా పోయారు. ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డికి ఇంచార్జ్ గా పదవి ఇవ్వడంతో ఆయన పార్టీని నిలబెట్టారు. అధికారం పోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామసుబ్బారెడ్డి పార్టీ మారిపోతారేమోనన్న ఉద్దేశంతో జగన్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి రామసుబ్బారెడ్డికి ఇంచార్జ్ పదవి ఇచ్చారు.
ఓటమి తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిన వైసీపీ
పులివెందుల తర్వాత జమ్మలమజడుగు నియోజకవర్గం తమ కంచుకోట అని జగన్ రెడ్డి అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు తనతో పాటు ప్రయాణించిన ఆదినారాయణ రెడ్డి అంత సీన్ లేదని నిరూపిస్తున్నారు. బీజేపీ తరపునే పోటీ చేసి ఆయన కూటమిలో భాగంగా విజయం సాధించారు. వైసీపీ నేతలు ఎవరూ ఆయన దెబ్బకు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పార్టీని నిలబెట్టుకోవాలంటే.. మళ్లీ పాత ప్రత్యర్థిని రంగంలోకి దించాలనుకున్నారు. ఫ్యాక్షన్ జరిగినా పర్వాలేదని.. రామసుబ్బారెడ్డికి కిరీటం పెట్టారు. గతంలో సజ్జల సుధీర్ తో పంచాయతీ జరిగినప్పుడు రామసుబ్బారెడ్డినే అవమానించారు. ఆయనకు పోటీ చేసేచాన్స్ లేదని కూడా మీడియా ముందు చెప్పారు.
వాడుకోవడానికే…చివరికి కుటుంబసభ్యులకే టిక్కెట్
జమ్మలముడుగులో.. రామసుబ్బారెడ్డికి ఇంచార్జ్ పదవి ఇవ్వడం వెనుక జగన్ ఆలోచన వేరుగా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి కుటుంబసభ్యులే పోటీ చేస్తారని చెబుతున్నారు. ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డిని తప్పించి.. జమ్మలమడుగు లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని.. ఎంపీగా మరో కుటుంబసభ్యుడు పోటీ చేస్తారని ఇప్పటికే గుసగుసలు ఉన్నాయి.అయితే పార్టీని నిలబెట్టడం చాలా ముఖ్యం కాబట్టి ఆ చాన్స్ రామసుబ్బారెడ్డికి ఇస్తున్నారు. పోటీ చేసేచాన్స్ మాత్రం ఆయనకు రాకపోవచ్చు.

