టీవీకే విజయకు తన చివరి సినిమా విషయంలో ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు డివిజనల్ బెంచ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎఫ్సీకి తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయ పడింది. ఈ ఉత్తర్వులు రద్దు చేసిన డివిజన్ బెంచ్.. మళ్లీ సింగిల్ బెంచ్ నే ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. దీంతో మళ్లీ వారు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించాల్సి ఉంది.
సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు , సంభాషణలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ U/A సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. వెంటనే సీబీఎఫ్సీ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజనల్ బెంచ్ ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. తర్వాత నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ నెల ఇరవైన తీర్పును రిజర్వ్ చేశారు. ఆ తీర్పును ఇవాళ ప్రకటించారు. కోర్టు తీర్పుతో సినిమా విడుదల అనిశ్చితిలో పడింది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసిన చిత్ర బృందం, ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూడాలి. సీబీఎఫ్సీ సూచించిన అన్ని మార్పులు చేశామని నిర్మాతలు వాదిస్తున్నా.. న్యాయప్రక్రియ వల్ల ఆలస్యం జరుగుతోంది. విజయ్ తన సొంత రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో, ఆయన సినిమాకు ఇలాంటి అడ్డంకులు ఎదురవ్వడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
