హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష
జనసేనకు యువనాయకత్వం అవసరమనీ, అసెంబ్లీకి కొత్త రక్తం కావాలనే దిశగా జనసేన ఆలోచిస్తోందన్నారు. అనుభజ్ఞులకు కూడా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ముందుగా సీపీఎం, సీపీఐలతో ముందుగా చర్చలు జరపనున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ఏం చేయాలనేది నిర్ణయిస్తామనీ, పోరాటం చేసి తీరతామనీ, దీన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్తాను అన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాననీ, ఆ అవసరం వచ్చేట్టుగానే ఉందన్నారు. చదువుకునే యువత, ఉద్యోగాలు చేసే యువతను ఇబ్బంది పెట్టననీ, రాజకీయ పోరాటాలు తాము చేస్తామనీ, బలిదానాలు అవసరమైతే పవన్ కల్యాణ్ చేస్తాడరన్నారు.
ఆంధ్రుడి ఆత్మ గౌరవం ఎలా ఉంటుందో కేంద్రానికి రుచి చూపిద్దామన్నారు. పొట్టి శ్రీరాములు ఇచ్చిన స్ఫూర్తి ఇంకా మనలో ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏదో ఒకటి చెప్పి తీరాలన్నారు. ఇది ఒక్క రాష్ట్ర సమస్య మాత్రమే కాదనీ, రాజ్యంగం ఇచ్చిన మాటను అతిక్రమించిన విధామనీ, అందుకే ఈ పోరాటాన్ని బలంగా తీసుకుంటున్నామన్నారు.
నంబర్ నొక్కితే జనసేన మెంబర్
93940 22222.. ఈ ఫోన్ నంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే జనసేన మెంబర్ గా చేరిపోవచ్చని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను పెద్దగా టెక్నాలజీ వాడే వ్యక్తిని కాదనీ, కాబట్టి సభ్యత్వ నమోదుకు కూడా సులువైన టెక్నిక్ చెప్పమని జనసేన టెక్ టీమ్ ని కోరితే… దీన్ని తయారు చేశారని పవన్ చెప్పారు.
వైకాపా అవిశ్వాసం ఏపాటిది..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో నటిస్తున్నారా అంటూ వైకాపా నేతలు తనను విమర్శిస్తున్నారని పవన్ అన్నారు. అయితే, తాను చంద్రబాబు డైరెక్షన్ లో నటిస్తున్నానని ఇప్పుడు అనిపిస్తోందా చెప్పండీ అని ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని తాను జగన్ ను కోరాననీ, దాంతో ప్రభుత్వం పడిపోతుందని కాదనీ, కనీసం ఒకరోజైనా ఆంధ్రా అంశం ఢిల్లీ స్థాయిలో చర్చకు వస్తుందనే ఆలోచనతో కోరాను అన్నారు. కానీ, దేశ బడ్జెట్ నే అర్థ గంటలో చేతులు దులిపేసుకునేట్టు తోసేశారనీ, ఆంధ్రప్రదేశ్ అంటే వారికి ఎంతనీ, జగన్ ప్రవేశపెట్టబోయే అవిశ్వాసం ఏపాటిదనీ పవన్ వ్యాఖ్యానించారు.
29 సార్లు ఢిల్లీకి వెళ్తే చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటారనీ, మరి విజయసాయి రెడ్డికి ఎలా ఇచ్చారని జగన్ ను ప్రశ్నించారు. దాని వెనక ఉన్న మర్మమేంటో ప్రజలకు తెలియాలన్నారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలంటే తనకు విసుగు అని పవన్ అన్నారు.
అన్నింటికీ చంద్రన్న పేర్లేనా..?
కుల నిర్మూలన తాము చెయ్యగలమో లేదో తెలీదుగానీ, కనీసం కులాల మధ్య ఐక్యత మాత్రం సాధిస్తామని జనసేన అధినేత అన్నారు. దేశంలో చాలా పథకాలకు అన్నీ రాజీవ్, ఇందిరా గాంధీల పేర్లు ఉన్నాయన్నారు. దేశమంతా ఒక కుటుంబం పేర్లేనా, రాష్ట్రంలో కూడా అదే పరిస్థితా అని ప్రశ్నించారు. దామోదరం సంజీవయ్య, డొక్కా సీతమ్మ లాంటివారు చాలామంది మనకు ఉన్నారన్నారు. ఆహార పథకానికి డొక్కా సీతమ్మ పేరును జనసేన పెడుతుందనీ, మరో పథకానికి దామోదరం సంజీవయ్య పేరును జనసేన పెడుతుందన్నారు. ఆంధ్రులు అభిమానించే సర్దార్ గౌతు లచ్చన్న పేరు ఒక్క పథకానికీ ఎందుకు నోచుకోలేదన్నారు. అన్నింటికీ చంద్రన్న పేర్లు పెట్టకపోతే… ఇలాంటి మహానుభావుల పేర్లు పెట్టొచ్చు కదా అని ఏపీ సీఎం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.
ఆయనపై ఓటుకు నోటు ఆరోపణలు..!
టీడీపీ , ఎన్డీయేలను ఒక కాంట్రాక్ట్ కావాలనిగానీ పదవి కావాలనిగానీ, ఇవ్వాలని గానీ తాను ఎప్పుడూ అడగలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు మంచి చేసే పనులు చేయమని మాత్రమే తాను కోరుతుంటే అది కూడా చేయకపోతే తానేం చేయనంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మీద ఓటుకు నోటు కేసులో అభియోగాలు వచ్చాయన్నారు. ఆరోజున తనను చాలామంది ప్రశ్నించారనీ, గుడ్డిగా చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నావని ప్రశ్నించారని పవన్ అన్నారు.
రాజకీయ వ్యవస్థ ఎంతో కొంత కుళ్లిపోయిందనీ, దాన్ని మనం అంగీకరించాలన్నారు. కేవలం తెలుగుదేశం నాయకులే అలాంటి పనిచేసుంటే వెంటనే అడిగేవాడిననీ, కానీ అందరూ అదే పని చేస్తున్నావారే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని (చంద్రబాబు) ఇబ్బంది పెడితే, ఎవరికైనా జరిగే న్యాయంలో ఇబ్బంది వస్తుందేమోనని కాస్త తగ్గి తాను మట్లాడాల్సి వచ్చిందన్నారు. ఎలాగూ చట్టప్రకారం జరిగేవి జరుగుతాయనీ, పుండుమీద కారం చల్లడం ఎందుకు అని తాను మౌనంగా ఉన్నాను అన్నారు. కానీ, ఈరోజున కూడా వారి బుద్ధి మారనందుకు బాధగా ఉందన్నారు! టీడీపీ నుంచి తాను ఆశించిన దానికి ఆశాభంగమే మిగిలిందన్నారు. ఇసుక మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనీ, ఎర్రచందనం మాఫియాపై ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదనీ, విశాఖ భూ కుంభకోణంపై చర్యలేవని ప్రశ్నించారు.
సింగపూర్ తరహా పాలన ఏదీ..?
ఒక ఎమ్మార్వో ఇసుక మాఫియా అడ్డుకున్నందుకు ఎలా దాడి చేస్తారంటూ పవన్ మండిపడ్డారు. వనజాక్షి మీద దాడి చేసిన ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోరా, ఆయనకి కొమ్ము వచ్చాయా చట్టం వర్తించదా మహిళా అధికారిపై దాడి చేస్తే ఆగ్రహించరా అంటూ పవన్ ఆగ్రహించారు. తమ సహనం చేతగాని తనం కాదని, దాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. సింగపూర్ తరహా రాజధాని అని ముఖ్యమంత్రి అంటారనీ, కానీ దానికంటే ముందు సింగపూర్ తరహా పాలన రావాలన్నారు. ఒకప్పటి సింగపూర్ ప్రధాని లీక్ వాంగ్ యు.. సొంత స్నేహితుడు లంచం తీసుకుంటే జైల్లో పెట్టించిన మహానుభావుడని చెప్పారు. ఆయన క్యాబినెట్ లో అన్ని దేశాల వారూ ఉన్నారన్నారు.
ఇదే తరహాలో ఒక మహిళా అధికారిపై సింగపూర్ లో దాడి జరిగి ఉంటే… దాడి చేసినవారిని తోలు ఊడిపోయేలా ప్రభుత్వం బుద్ది చెప్పేదన్నారు. అక్కడ అలాంటి చట్టాలు ఉన్నాయన్నారు. అలాంటివి చేయడానికి మన ప్రజాస్వామ్యం ఒప్పుకోకపోయినా… దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేని ఎలా వెనకేసుకుని వస్తారంటూ ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహార శైలితో ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అని ప్రశ్నించారు.
లోకేష్ అవినీతి మీకు తెలుసా…?
ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అవినీతి చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ విషయం సీఎంకి తెలుసా, తెలిసే స్పందించకుండా చూస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి చాలా ఎక్కువ ఉందనే విషయాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్రం విడిపోయాక అవినీతిలో ఆంధ్రా నంబర్ వన్ స్థానం అని ఒక సంస్థ నివేదికలో పేర్కొందన్నారు. దాన్ని కూడా చంద్రబాబుకు చూపించాను అన్నారు. 2019 ఎన్నికలు 2014 అంత సుఖంగా అయితే టీడీపీకి ఉండవని జోస్యం చెప్పారు.
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎవరితో కలిసి ఉంటారో తెలీదనీ, జగన్ ని ఎదుర్కోవాలనీ, అందుకనే తాము అవినీతి చేసుకుంటామని నేతలు బాహాటంగా మాట్లాడుతూ ఉంటే బాధ కలగదా అన్నారు. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వస్తోందనీ, వారి హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి సొమ్ము తీయడం లేదు కదా అనీ, వారి ఆస్తులను ఖర్చు చేయడం లేదు కదా.. మరి సొమ్ము ఎక్కడి నుంచి వస్తోందని టీడీపీని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల కోసం నియోజక వర్గానికి రూ. 25 కోట్లు సర్ది పెట్టేశామని బాహాటంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారన్నారు. వారు చేసిన పనులు చూస్తుంటే.. ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుందన్నారు. ‘ఈరోజున మీ అబ్బాయి స్వయంగా చేస్తున్న అవినీతి మీకు తెలుసా’ అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అవినీతి అని ఆరోపించారే గానీ.. అదేంటో స్పష్టంగా పవన్ చెప్పలేదు.
వైకాపా నేతలు అసెంబ్లీకి ఎందుకు రారు..?
ఆంధ్రా ప్రయోజనాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్నాళ్లూ ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయలేదని టీడీపీని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఆత్మగౌరవం మీద టీడీపీ నేతలతో సహా అందరూ దెబ్బ కొట్టారని విమర్శించారు. పోనీ.. ప్రతిపక్షం వైకాపా బలంగా పోరాడుతుందా అంటే.. వారు అసెంబ్లీకే రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తారా, లేదంటే వెళ్లరా అంటూ జగన్ ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేదు కదా, అయినా ప్రజల ముందుకు వచ్చాడు కదా అన్నారు. సమస్యల మీద పోరాటం చేయాలంటే ముఖ్యమంత్రి కావాలా అనీ, ఆ విధానం మార్చుకుంటే తప్ప వారి లక్ష్యం నెరవేదన్నారు.
ఆ బాధ్యతతో జాగ్రత్తగా మాట్లాడతాను!
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని, తెలంగాణ వాదం అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారంటూ కొంతమంది తెలంగాణ నేతలు ఈ మధ్య టీవీల్లో అనడం చూశానని పవన్ చెప్పారు. ‘ఆంధ్రా రాజకీయాలు అంత సున్నితమైనవా..? మందుపాత్రలు పెట్టి పేల్చేస్తారు ఇక్కడి నాయకులు, నిరాయుధలని కాల్చి వేటాడి చంపేస్తారు. కడపలో రెండు వర్గాల మధ్య దాడి ఎలా జరిగిందో మొన్ననే చేశాం’ అన్నారు. ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు తాను ఎంతో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మీ ఇంట్లో ఒక అన్నగా తమ్ముడిగా కుటుంబ సభ్యుల జీవితాలను ఎందుకు పణంగా పెడతా అన్నారు. ప్రజల ప్రాణాలు చాలా విలువైనవనీ, అందుకే బాధ్యతగా మాట్లాడతానని చెప్పారు. తానొక సాధారణ కానిస్టెబుల్ కుమారుడుని అన్నారు.
అరుణ్ జైట్లీపై పవన్ పంచ్..!
ప్రత్యేక హోదా గురించి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసి వ్యాఖ్యలకు బదులు చెప్పడంతో పవన్ ప్రసంగం మొదలుపెట్టారు. గడచిన నాలుగేళ్లుగా ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయం మమ్మల్ని ఆవేదనకు గురి చేస్తోందన్నారు. సెంటిమెంట్ కోసం ప్రత్యేక హోదా ఇవ్వనని మీరు చెప్పారనీ, మరి ఏ సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ ఇచ్చారని ప్రశ్నించారు. అరుణ్ జైట్లీకి చరిత్ర గుర్తు చేయాలంటూ.. 1972లోనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఆంధ్రులు డిమాండ్ చేశారని చరిత్ర గుర్తు చేశారు. కానీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీ కలిసుండాలనే చెప్పారన్నారు. 1987లో కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని భాజపా చెప్పిందన్నారు. ఆ తరువాత, పార్లమెంటులో రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇస్తామని చెప్పింది భాజపానే అన్నారు.
మీరు ఇచ్చిన హామీలు పాటించనప్పుడు… మీ చట్టాలని మేమెందుకు పాటించాలని ప్రశ్నించారు. చట్టాలు మీకు ఉండవా.. గౌరవించరా, తలవంచరా అంటూ మండిపడ్డారు. అత్యంత అప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాన్ని 2014లో విడదీశారన్నారు. రాజధాని లేకుండా మమల్ని తరిమేయడంతోనే హోదా అడుగుతున్నాం అన్నారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు వారి వ్యక్తిగత కారణాల వల్ల కేంద్రానికి భయపడుతున్నారేమో అన్నారు.కానీ, మాకు కేంద్రం అంటే భయం లేదన్నారు.