రాహుల్ గాంధీ చెప్పినా తాను నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయబోనని.. మొదట్లోనే తేల్చేసిన కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారు. రాహుల్ దాకా ఎందుకు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా… తాను పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డే అభ్యర్థి అని ఉత్తమ్ ప్రకటించేశారు కూడా. దీనిపై జానారెడ్డి కూడా సుముఖంగానే ఉన్నారు. ఎందుకు జానారెడ్డి ఇలా మారిపోయారు.. అంటే… రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పే అనుకోవాలి. నాగార్జున సాగర్‌లో భారతీయ జనతా పార్టీకి ఉనికి లేదు. గత ఎన్నికల్లో డిపాజిట్ రాలేదు. అక్కడ బీజేపీ మార్క్ సెంటిమెంట్ రెచ్చగొట్టే పరిస్థితులు లేవు. జానారెడ్డి లాంటి బలమైన నేతను చేర్చుకుంటేనే.. బీజేపీకి బలమొస్తుంది.
అయితే… సంప్రదాయంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బలమైనది. అక్కడ మొదటి సారి టీఆర్ఎస్ గెలిచింది. అయితే నోముల నర్సింహయ్యపై అక్కడి ప్రజల్లో అంతగా సానుభూతి కనిపించడం లేదు. వారి కుటుంబసభ్యుల్ని నిలబెట్టినా… టీఆర్ఎస్ గెలవదనే ప్రచారం ప్రారంభమయింది. బీజేపీకి బలం లేదు.. టీఆర్ఎస్ గెలవదని చెప్పుకుంటున్నారు. మరి ఇంకెవరు గెలవాలి..? ఉన్న చాన్స్ కాంగ్రెస్ పార్టీనే.అదీ కూడా జానారెడ్డినే. జానారెడ్డి కాకుండా ఆయన కుమారుడ్ని నిలబెట్టినా… తేడా వచ్చేస్తుంది. ఈ విషయం జానారెడ్డికి కూడా అర్థమైందంటున్నారు.
అన్నింటికి మించిన పొలిటికల్ ఫార్ములా ఏమిటంటే…కేసీఆర్ వ్యూహం. నాగార్జున సాగర్‌లో బీజేపీ గెలిస్తే.. మొదటికే మోసం వస్తుంది. అందుకే టీఆర్ఎస్ వైపు నుంచి జానారెడ్డి గెలుపు కోసం సహకారం అందుతుందన్న లీక్ బయటకు వచ్చింది. అంతే కాదు..బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగిన జానారెడ్డి ఆగిపోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పరోక్షసహకారం ఇవ్వడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉండటంతో జానారెడ్డి కూడా పోటీకి సిద్ధమంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే..రాహుల్ గాంధీ చెప్పినా సరే.. పోటీ చేయబోనని భీష్మించిన జానారెడ్డి.. ఓ రకంగా కేసీఆర్ చెబితే ఓకే అన్నారన్నమాట. మొత్తానికి రాజకీయం అంటే అదేనేమో..?