తెలంగాణలో జరుగుతున్న జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై తెలుగుదేశం పార్టీ ఓ స్పష్టతకు వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి బీజేపీకి సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. అయితే అడగకపోయినా వెళ్లి మద్దతు ప్రకటించాల్సిన పని లేదని అడిగితేనే మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
తెలంగాణలో ఉనికిలో లేని ఎన్డీఏ
తెలంగాణలో ఎన్డీఏ ఉనికిలో లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. కానీ తర్వాత ఏ పార్టీతోనూ పొత్తులు లేవని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఎన్డీఏ ప్రస్తావన వస్తే అది ఏపీకే పరిమితమని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి టీడీపీ పోటీ గురించి ప్రచారం జరిగింది. కానీ పోటీ చేసే ఉద్దేశం లేదని ముందుగానే అందరికీ స్పష్టత ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా టీడీపీ సపోర్టు కోసం ప్రయత్నిస్తోందన్న ప్రచారం కారణంగా.. చంద్రబాబు ఏం సూచనలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయన అడిగితే బీజేపీకే సపోర్టు చేయాలని ఆదేశించారు.
జూబ్లిహిల్స్ లో టీడీపీ ప్రభావం స్వల్పమే
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు అనంతర రాజకీయాల్లో బీఆర్ఎస్ చేసిన రాజకీయాల కారణంగా క్యాడర్ అంతా ఆ పార్టీలో చేరిపోయింది. అక్కడ చేరలేని వారు చెల్లాచెదురు అయిపోయారు. పార్టీ పరంగా సానుభూతిపరులు ఉన్నారు కానీ లీడర్లు లేకుండా పోయారు. బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి టీడీపీనేత. ఆయన పోటీ చేస్తే టీడీపీ ఆయనకే మద్దతు ఇవ్వనుంది. ఎవరు పోటీ చేసినా… అధికారికంగా టీడీపీ మద్దతు వారికే ఉంటుంది.
జనసేన పార్టీ నిర్ణయం కూడా అంతే
జనసేన పార్టీ కూడా బీజేపీ అభ్యర్థికే మద్దతు ప్రకటించడం లాంఛనం అనుకోవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు కానీ ఎక్కడా సానుకూలఫలితాలు రాలేదు. అయితే త్వరలో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు అయినా ఈ పార్టీల అవసరం ఉంటుంది. అందుకే ఎన్డీఏను జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కేంద్రంగా.. తెలంగాణకు విస్తరించి.. అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జూబ్లిహిల్స్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.