జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు రాష్ట్రాలకు చెందిన కీలక కార్యకర్తలతో ఈ నెల 30 వ తేదీన విశాఖలోని మున్సిపల్ స్టేడియంలో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలా పోరాడాలన్నదానిపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో పాటు సోషల్ మీడియాలో దారి తప్పుతున్న కార్యకర్తలకూ కర్తవ్య బోధ చేసే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. సమావేశం ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురంలో ఆవిర్భావ సభను నిర్వహించిన తర్వాత మరోసారి పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడం ఇదే ప్రథమం.
పవన్ కల్యాణ్ తీరిక లేకుండా ఉంటున్నారు. ఉపముఖ్యమంత్రిగా కీలక శాఖను ఆయన చూసుకుంటున్నారు. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న సినిమాలను కాస్త తీరిక చేసుకుని పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. పెండింగ్ సినిమా షూటింగులు దాదాపుగా పూర్తయ్యాయని అందుకే ఇక పార్టీ కోసం సమయం కేటాయిస్తున్నారని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.