జనసేనాని ఉత్తరాంధ్ర పర్యటన సమీక్ష

మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ముగిసింది. ఉత్తరాంధ్ర గా వ్యవహరించే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో జనసేన పర్యటన సుమారు 50 రోజులపాటు కొనసాగింది. ఇంతకీ ఈ పర్యటన ఎలా జరిగింది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఏం సాధించాడు , ఏం సాధించలేకపోయాడు – ఒకసారి సమీక్షిద్దాం.

జనసేనాని పర్యటన ఏవిధంగా వైవిధ్యం:

జనసేనాని గతంలో చేసిన పర్యటనలకు, ఇప్పటి పర్యటన కి చాలా తేడా ఉంది. అధికార పార్టీని సమర్థిస్తూ, ప్రతిపక్ష నేతను కార్నర్ చేస్తూ జరిగిన గత పర్యటనలకు అధికారపార్టీ సహా మీడియా ఛానల్స్ నుంచి కూడా అపూర్వమైన మద్దతు లభించింది, ఎక్కడికెళ్లినా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. పవన్ మాటల్లోని అర్థాలను ,అంతరార్థాలను విశ్లేషిస్తూ మీడియాలో గంటల తరబడి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అధికార పార్టీతో నెయ్యం మానేసి, మీడియాతో కయ్యం పెట్టుకున్నాక జరిగిన మొదటి పర్యటన ఇది. అలాగే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సంక్షిప్త పర్యటన లతో పోలిస్తే ఇదే కాస్త దీర్ఘకాలం జరిగిన పర్యటన. అలాగే తన సినిమాల్లో ఉత్తరాంధ్ర జానపదాలను వినియోగిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తరాంధ్రపై తన మమకారాన్ని బయటకి చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ తన మొదటి పర్యటన ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించడం విశేషం.

ఈ పర్యటన ద్వారా సాధించినవి ఏమిటి:

మత్స్యకారుల మద్దతు:

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా నే మత్స్యకారులు పవిత్రంగా జరుపుకునే గంగమ్మ పూజ రోజు ఈ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభించారు. తాను స్వయంగా వారి పూజల్లో పాల్గొంటూ, వాళ్లతో మమేకం కావడానికి ప్రయత్నించాడు. గతంలో ఆదివాసీలు, మత్స్యకారులు ఇద్దరూ పవన్ కళ్యాణ్ పై పదునైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మత్స్యకారులని ఎస్టీల్లో చేరుస్తామని పేర్కొంది. అయితే ఆ హామీపై పురోగతి లేకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచ సాగారు. వారు ఏర్పాటు చేసుకున్న సభకు హాజరుకావడానికి ఆమధ్య పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడంతో గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో తన పర్యటన రద్దు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఉత్తరాంధ్ర పర్యటన ద్వారా మత్స్యకారులకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిన ని అడిగితే తాను ఒక కులానికి ఒక వర్గానికి వ్యతిరేకినని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విడమరచి చెప్పగలిగారు. పర్యటన ఆద్యంతం మత్స్యకారుల సమస్యలను ప్రస్తావిస్తూ వాళ్లతో మమేకమై పోవడానికి ప్రయత్నించారు. ఆంధ్రరాష్ట్రంలో బీసీలలో ఉన్న మత్స్యకారులు జనాభా పరంగా 4 నుంచి 5 శాతం దాకా ఉండవచ్చని అంటారు.

గిరిజనులతో వారం రోజులు:

అరకులో సుమారు వారం రోజులపాటు పవన్ కళ్యాణ్ ఉండిపోయారు. అయితే ఓట్ల పరంగా చూస్తే ఈ గిరిజన జనాభా చాలా తక్కువ అని, మరీ వారం రోజులపాటు ఇక్కడ ఎందుకు బస చేస్తున్నాడని కొంతమంది వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఎన్ని ఓట్లున్నాయన్నది అన్నది ముఖ్యం కాదని, ఎన్ని సమస్యలున్నాయన్నది తనకు ముఖ్యమని వ్యాఖ్యానించి, ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం చేశాడు. బహుశా వారంరోజులపాటు అరకులో – గతంలో ఏ పార్టీ నాయకుడు గడిపిన సందర్భం లేదంటే అతిశయోక్తి కాదేమో. అక్కడే వారితోపాటు ఉంటూ, అదే బురద నేల పై కూర్చుంటూ, వారు చెప్పే సమస్యలను సావధానంగా వింటూ పవన్కళ్యాణ్ గడిపాడు. ఒకవేళ చానెళ్లతో సున్నం పెట్టుకోక ముందు గనక ఇలాంటి పర్యటన చేసి ఉంటే వీటికి ఆయా చానెళ్లు విపరీతంగా కవరేజ్ ఇచ్చి ఉండేవి అనడంలోసందేహం లేదు.

స్థానిక సమస్యల పైన ఫోకస్:

గతంలో పాదయాత్రలు, బస్సుయాత్రలు, రథయాత్రలు, చైతన్యయాత్రలు జరిగాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్ర కూడా అలాంటి మరొక యాత్ర. అయితే వాటికి వీటికి ఉన్న ఒక తేడా ఏమిటంటే గతంలో జరిగిన యాత్రలో పార్టీ అధినేతలు ప్రధానంగా రాష్ట్ర స్థాయి సమస్యలపై, ఒక వర్గం యొక్క సమస్యల పైన (ఉదాహరణకి రైతులకు ఉచిత విద్య, రైతు రుణమాఫీ) విస్తృతంగా ప్రస్తావించేవారు. అయితే పవన్ కళ్యాణ్ యాత్ర ప్రధానంగా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ కొత్త ఒరవడిని సృష్టించింది అని చెప్పవచ్చు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాధించలేని ఎంపీలు రైల్వేజోన్ సాధిస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు అని చెప్పినా, జిఎస్టి అంటే గౌతు శిరీష ట్యాక్స్ అని అధికార ఎమ్మెల్యే వర్గానికి చురకలంటించినా, ఆంత్రాక్స్ బోదకాలు వంటి స్థానిక ఆరోగ్య సమస్యలను ప్రస్తావించినా, స్థానిక సమస్యలపై ప్రధానంగా పోరాడుతున్న పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో భాగమే. ఇది కూడా పార్టీకి సత్ఫలితాలను ఇచ్చింది. వీటితోపాటు స్థానిక సంస్కృతిని ప్రస్తావిస్తూ, గతంలో పోరాటాలు చేసిన స్థానిక నాయకులను గుర్తుచేసుకుంటూ ప్రసంగాలను ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నించారు.

ఉద్దానం సమస్య:

ఈ సమస్య దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్నప్పటికీ, ఈ సమస్య పేరెత్తితేనే పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేలా చేసుకోవడం వరకు పవన్ కళ్యాణ్ సఫలీకృతుడయ్యాడు. మరొకసారి ఈ సమస్య ప్రస్తావించి, నెరవేర్చని హామీలను గుర్తుచేసి, ముఖ్యమంత్రి సైతం మరొకసారి ఈ సమస్యపై దృష్టి సారించేలా పర్యటనలో చేయగలిగాడు.

బలమైన ప్రత్యర్థిగా రూపాంతరం:

నిజానికి పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు అభిమానులు సీఎం సీఎం అని నినాదాలు చేసినా, తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశలేదని నీరుగార్చే వాడు. “అలా చెప్పడం వల్ల ఓట్లు వేయాలని అనుకునే వాళ్లు కూడా వేయరు కాస్త చూసుకో పవన్” అని విమర్శకులు చాలాసార్లు గుర్తు చేశారు. అయితే ఈ పర్యటన మొదలు పెట్టిన దగ్గర నుంచి తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం ప్రారంభించారు. చెప్పడం వరకు బాగానే ఉంది కానీ బలమైన నాయకులు పార్టీ లో చేరేంత వరకు ప్రజలు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మరు. అయితే తన వైపు నుండి స్పష్టత ఇవ్వడం వరకు పవన్ కళ్యాణ్ సఫలీకృతుడయ్యాడు.

సాధించలేకపోయినవి ఏమిటి

“బీజేపీతో కుమ్మక్కు ” విమర్శని తిప్పికొట్టలేకపోవడం:

సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు, చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు బిజెపి విమర్శించని పార్టీలు కూడా బిజెపి మీద ఉన్న వ్యతిరేకతను పంచుకోవలసి వస్తుంది. పవన్- జగన్ ఇద్దరూ కూడా బిజెపితో కుమ్మక్కు అయ్యారు అని చంద్రబాబు మరియు టిడిపి వర్గాలు చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. గతంలో కూడా 2014 ఎన్నికలకు ముందు, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ జగన్ ని – ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్కు జత కలిపి మాట్లాడి ఇదే తరహా వ్యూహాన్ని విజయవంతంగా చంద్రబాబు అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీతో తాను కుమ్మక్కు కాలేదు అని నిరూపించుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యాడు. బిజెపి మీద ఏవో కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ తనదైన శైలిలో పదునైన వ్యాఖ్యలు చేయకపోవడమే ఇందుకు కారణం.

ఉపన్యాసాల్లో భరోసా ఇవ్వలేకపోవడం:

నిజానికి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఒకప్పుడు సినిమా ఫంక్షన్లలో నాలుగు ముక్కలు మాట్లాడడానికి కూడా తడబడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక గంటల తరబడి అనర్గళంగా ఉపన్యసించగలుగుతున్నారు. అయితే ఉత్తరాంధ్ర పర్యటన లో పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు- అధికార పార్టీ నేతల మీద విరుచుకు పడటానికి, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అభిమానులకు భరోసా కల్పించడానికి పరిమితమయ్యాయి తప్ప ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయాయి. ఉదాహరణకి చంద్రబాబు గొప్ప వక్త కానప్పటికీ, 2014 ఎన్నికలకు ముందు సింగపూర్ తరహా ఇక్కడ కూడా అందరూ మినరల్ వాటర్ తాగుతారని, సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తామని, ఇంకా ఏమేమి చేస్తామో స్పష్టంగా చెబుతూ ప్రజలకు భరోసా కల్పించగలిగారు. కెసిఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చాక ఏమి చేస్తామో స్పష్టంగా వివరిస్తూ ప్రజలకు ఒక విజన్ చూపించగలిగారు. అయితే పవన్కళ్యాణ్ ఉపన్యాసాలలో యువత చేత చప్పట్లు కొట్టించుకునే అంశాలు ఉన్నప్పటికీ మధ్యతరగతికి లేదా సామాన్య ప్రజానీకానికి ఒక భరోసా ఇవ్వగలిగే అంశాలు ఇప్పటివరకైతే లేవు.

మీడియా మద్దతు పొందలేకపోవడం:

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా చేశారో లేక తొందరపడి చేశారో తెలియదు కానీ మీడియాతో అయితే సంబంధాలు తెంచుకున్నారు. దాంతో గతంలో పవన్ కళ్యాణ్ చిన్న ట్వీట్ చేస్తే రోజంతా స్క్రోలింగ్, గంటల తరబడి డిబేట్ లు ఇచ్చిన చానళ్ళలో- ఇప్పుడు వారాల తరబడి గిరిజన ప్రాంతాల్లోన బసచేసి, అంబేద్కర్ భవన్లో బసచేసి, మత్స్యకారులతో మమేకమైపోయి – ఇంకా ఇలాంటివి ఎన్నో చేస్తున్నప్పటికీ వీటి గురించి ప్రజలకు పెద్దగా తెలియకుండా పోయాయి అంటే దానికి కారణం మీడియా మద్దతు లేకపోవడమే. సోషల్ మీడియాలో ఎంత విరివిగా ప్రచారం చేసినా అవి రీచ్ అయ్యేది కొంతమందికి మాత్రమే. తను ఇంత పెద్ద ఎత్తున పర్యటన పెట్టుకున్నప్పటికీ, మీడియాలో కవరేజ్ వచ్చేలా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ పెద్దఎత్తున ప్రయత్నించినట్టు కనబడలేదు.

భవిష్యత్తు పర్యటనలు:

నిజానికి పవన్ కళ్యాణ్ పర్యటన, గతంలో జరిగిన ఈ తరహా పర్యటనలకు భిన్నంగానే కొనసాగింది నిరసన కవాతులు చేయడం, రాష్ట్రస్థాయి సమస్యలకంటే స్థానిక సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, మిగతా యాత్రలాగా “సీక్వెన్షియల్ గా అన్ని ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్లిపోవడం” కాకుండా వెళ్లిన ప్రాంతానికి మళ్లీ వెళ్లి అక్కడ సమస్యలపై చర్చిస్తూ స్థానికులతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ కొనసాగడం, వీటన్నింటికీ మించి మందు బిర్యాని ఇలాంటివి పంచ పెట్టకుండానే లక్షలాదిమంది పోగయేలా చేయడం- ఇవన్నీ ఈ పర్యటనను మిగతా వాటితో పోల్చి చూసిన వారికి- పవన్ పర్యటన కాస్త భిన్నంగా ఉందనిపించేలా చేశాయి.

పర్యటన మధ్యలో రంజాన్ సెలవులు అని కారణం చెప్పి పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తన కంటికి సంబంధించిన సమస్య కూడా ఉండడం వల్ల ఈ విరామం తప్పనిసరి అయినట్టు తెలుస్తోంది. ఇది చిన్న విషయమే అయినప్పటికీ, బ్రేకులు లేకుండానే యాత్ర చేయాలని ప్రజలు పట్టుబడ్డనప్పటికీ, ఇలాంటి బ్రేకులు ముందు ముందు రాకుండా చూసుకుంటే బాగుంటుంది. లేదంటే విమర్శకులు తమ అస్త్రాలకు పదును పెడుతూనే ఉంటారు.

స్థానిక సమస్యలను ప్రస్తావించడం, అధికార పార్టీ నేతల అవినీతిపై (చిరంజీవి లా కాకుండా )దూకుడుగా వెళ్లడం, “మీట్ అండ్ గ్రీట్” కంటే ఎక్కువగా సమస్యలను ప్రస్తావించడానికి ప్రాముఖ్యత ఇవ్వడం – ఇలాంటివి పర్యటన మీద మంచి అభిప్రాయం కలిగేలా చేయడానికి దోహదపడ్డాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా పెద్దఎత్తున నాయకులు చేరుతారని పార్టీ బలోపేతం అవుతుందని భావించిన వారికి మళ్లీ నిరాశ తప్పలేదు. అలాగే భవిష్యత్తు పర్యటనలలో, భరోసా కల్పించగలిగేలా ఉపన్యసించడం బీజేపీతో కుమ్మక్కు కాలేదని ప్రజలను కన్విన్స్ చేయగలగడం, లీడర్లను కాకపోయినా కనీసం క్యాడర్ను భారీగా తన పార్టీలో చేర్చుకోవడం లాంటి అంశాలు కూడా తోడైతే భవిష్యత్తు పర్యటనలు మరింత ఫలప్రదం అయ్యే అవకాశం ఉంది.

– జురాన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close