విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం కోసం జనసేన కార్యకర్తలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. వీరిలో కర్ణాటక కార్యకర్తలు కర్ణాటక రాష్ట్ర జెండాను తీసుకు వచ్చారు. జనసేన జెండాలతో కలిపి ఆ జెండాను కూడా కార్యకర్తలు ప్రదర్శించారు. దీంతో పవన్ కల్యాణ్ ఆ జెండాతో పాటు కండువాలను ను తెప్పించుకున్నారు. మెడలో వేసుకుని జెండాను ఊపారు. దీంతో సభ జరుగుతున్న ప్రాంతం మార్మోగిపోయింది.
దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక జెండా లేదు కానీ కర్ణాటకకు ఉంటుంది. అక్కడి ప్రజలంతా కర్ణాటక జెండాను తమ గుర్తుగా చూస్తారు. కర్ణాటకలో ఎక్కడికి వెళ్లినా ఆ జెండా కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఆ జెండాను గౌరవిస్తాయి. పవన్ కల్యాణ్ కూడా ఆ గౌరవం ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు కర్ణాటకలోనూ పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కాకుండా జనసేన భావజాలానికి ఆకర్షితులైన వారు కూడా అక్కడ కార్యకర్తలుగా మారారు.
ఇక తమిళనాడు, ఒడిషా, తెలంగాణ నుంచి కూడా భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. తమిళనాడులో పవన్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. తమిళ మీడియాకు.. తమిళంలో ఆయన ఇచ్చిన ఇంటర్యూలు వైరల్ అయ్యాయి. అందుకే పవన్ కల్యాణ్ తన పార్టీని విస్తరించే ఆలోచన కన్నా.. భావజాలాన్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నారు.