జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి అన్ని విషయాల్లోనూ ఆలస్యమే. పవన్ కల్యాణ్ విషయంలో అయినా సొంత పార్టీ విషయంలో అయినా ఆయన నాన్ సింక్ గా స్పందిస్తూ ఉంటారు. కోమటిరెడ్డి ఇష్యూ పెద్ద దుమారం రేపి.. సద్దుమణుగుతున్న సమయంలో ఇప్పుడే తెలిసినట్లుగా ఆయన కొత్తగా విచిత్రమైన ప్రకటనలు చేశారు.
మంత్రి కోమటిరెడ్డినిని శ్రీరాముడి తో పోల్చిన ఆయన, కోమటిరెడ్డి వంటి దేవుడి లాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రికి ఉన్న గొంతు సమస్య ను ఆసరాగా చేసుకుని, కొందరు కావాలనే ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ దుష్ప్రచారం తనను ఎంతగానో కలిచివేసిందని, గత మూడు రోజులుగా తాను అన్నం కూడా తినలేకపోయానని ఆయన ఆవేదన చెందారు.
మంత్రి మొబైల్కు కనీసం లాక్ కూడా ఉండదు, అంతటి పారదర్శకమైన వ్యక్తి ఆయ అని అనిరుధ్ రెడ్డిచెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి కోసం బావిలో దూకమన్నా దూకడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తన విధేయతను చాటుకున్నారు. ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోందని, త్వరలోనే అసలు నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఎవరూ తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ వివాదం మొదలై మూడు రోజులు గడుస్తున్నా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంత ఆలస్యంగా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనిరుథ్ రెడ్డి ప్రకటన చూస్తే.. కోమటిరెడ్డిని సపోర్ట్ చేసినట్లుగా లేదని.. ట్రోలింగ్ చేసినట్లుగా ఉందన్న సెటైర్లు కాంగ్రెస్ లోనే వినిపిస్తున్నాయి.


