బాలీవుడ్ లో విడుదలైన ‘పరమ్ సుందరి’ డిజాస్టర్ ఖాతాలో చేరిపోయింది. ఈ సినిమాపై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకొంది. ప్రమోషన్ కూడా గట్టిగా చేసింది. అయినా ఫలితం రాలేదు. జాన్వీ నటనకు పెద్దగా మార్కులు పడలేదు. దాంతో జాన్వీలో నిరాశ మొదలైంది. మరోవైపు తెలుగులో తాను చేసిన `దేవర` హిట్టయినా, వ్యక్తిగతంగా పెద్దగా కలసి రాలేదు. ఆ సినిమాలో జాన్వీ చేసింది కూడా ఏం లేదు. ఆమె పాత్ర ‘దేవర 2’లో ఎక్కువగా ఉంటుందని అన్నారు. అయితే `దేవర 2` ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈలోగా `పెద్ది`లో అవకాశం అందుకొంది. రామ్ చరణ్ తో జోడీ అంటే… కథానాయికగా ఓ మెట్టు పైకి ఎక్కినట్టే. `పెద్ది`కి ముందు `పరమ్ సుందరి` సినిమాతో హిట్టు కొట్టి.. కాస్త హుషారు తెచ్చుకొందామనుకొంది జాన్వీ. కానీ అది కుదర్లేదు.
శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీకి ఊహించని విజయాలేం రాలేదు. అలాగని ఆమె పరుగు ఎక్కడా ఆగలేదు. మెల్లమెల్లగా తన కెరీర్‌ని గాడిలో పెట్టుకొంటోంది. తెలుగు నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా ‘నో’ చెప్పిన జాన్వీ.. చివరికి ‘దేవర’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తనకు ప్లస్సో… మైనస్సో చెప్పుకోలేని పరిస్థితి. ఇక ఏమైనా నిరూపించుకోవాలంటే.. ‘పెద్ది’లోనే. బుచ్చిబాబు తొలి సినిమా ‘ఉప్పెన’లో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కానీ `పెద్ది` లవ్ స్టోరీ కాదు. యాక్షన్ డ్రామా. ఇలాంటి కథలో హీరోయిన్‌కి ప్రాధాన్యం ఇవ్వడం కష్టమే. `దేవర`లోనూ ఇదే జరిగింది. ‘దేవర’ పెద్ద స్పాన్ ఉన్న కథ. ఆ కథలో హీరోయిన్ పాత్ర తేలిపోయింది. ఇప్పుడు ‘పెద్ది’లోనూ అదే జరిగితే.. జాన్వీ ఆశలు గల్లంతయినట్టే. కనిపించేది కొంత సేపే అయినా.. తన గ్లామర్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఒక్కటే జాన్వీ చేతుల్లో ఉన్న అంశం. మరి ‘పెద్ది’తో జాన్వీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.