ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి బౌలర్ ఎవరంటే… బుమ్రా పేరు చెప్పాల్సిందే. పిచ్ ఎలాంటిదైనా, ఎదుట ఉన్నది ఏ స్థాయి బ్యాటర్ అయినా కచ్చితత్వంతో బౌలింగ్ వేస్తాడు. ముఖ్యంగా తన యార్కర్లకు బదులు చెప్పే బ్యాటరే లేడు. ఎవరిపై ఎదురు దాడికి దిగినా, బుమ్రా స్పెల్ మాత్రం కాచుకొని కూర్చోవాల్సిందే..అని ప్రత్యర్థులు ముందే ప్రిపేర్ అయిపోతారు. అదీ బుమ్రా అంటే. ఈ ప్రపంచకప్ లోనూ బుమ్రా ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. టోర్నీలో 14 వికెట్లు సాధించి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. తన ఎకానమీ అయితే తిరుగులేదు. బ్యాటర్ల హవా కొనసాగిన ప్రపంచకప్లో, సిక్సర్లూ.. ఫోర్లతో హోరెత్తిన ఈ టోర్నీలో ఓవర్ కి సగటున కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడంటే.. బుమ్రా మ్యాజిక్ ఎలా సాగిందో అర్థం చేసుకోవొచ్చు. ఫైనల్ లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. తనకే మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు దక్కింది.
అంతకు ముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఓడిపోయినా, బుమ్రా ప్రదర్శన ఆకట్టుకొంది. పాకిస్థాన్, వెస్టీండీస్ జట్లపై భారత్ విజయఢంకా మోగించడంలో బుమ్రాది కీలక పాత్ర. మరీ ముఖ్యంగా సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు విజృంభిస్తున్నప్పుడు 16, 18 ఓవర్లలో బుమ్రా ప్రత్యర్థిని గొప్పగా కట్టడి చేశాడు. ఆ ఓవర్లు బుమ్రా అంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేయకపోతే.. భారత్ ఫైనల్ కే వచ్చేది కాదు. మ్యాచ్ ఫలితాలు డిసైడ్ అయిపోయే డెత్ ఓవర్లలో బుమ్రా లాంటి బౌలర్ ఉండడం.. భారత్ అదృష్టమనే చెప్పాలి. ‘బుమ్రాలాంటి ప్రపంచ స్థాయి బౌలర్ ఉండడం వల్లే.. భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఛాంపియన్ గా మారింది’ అని క్రీడా విశ్లేషకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ దశాబ్దానికి బుమ్రాలాంటి బౌలర్ ఒక్కడే పుడతాడంటూ సునీల్ గవాస్కర్ కితాబు ఇచ్చారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ‘బుమ్రా భారతదేశ నిధి’ అంటూ కీర్తించాడు. బ్యాటర్ల హవా ఎక్కువగా ఉండే క్రికెట్ లో.. అందులోనూ బ్యాటర్లే ఆధిపత్యం చూపించే టీమ్ ఇండియా లాంటి జట్టులో బౌలింగ్ లో ఓ స్టార్ పుట్టుకురావడం, ప్రపంచంలోని మేటి బ్యాటర్లని బెంబేలిత్తించడం నిజంగానే గొప్ప విషయం.


