హైదరాబాద్ లో ప్రీ లాంచ్ పేరుతో అమాయక ప్రజల నుండి సుమారు రూ. 300 కోట్ల మేర వసూలు చేసి మోసానికి పాల్పడిన జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ కాకర్ల శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆయన్ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కోర్టులో హాజరు పరిచారు.
ఈ భారీ కుంభకోణం వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అనుమతులు లేని ప్రాజెక్టులను తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి, మధ్యతరగతి ప్రజల నుండి కోట్లాది రూపాయలను జయత్రి ఇన్ఫ్రా వసూలు చేసింది. అయితే, ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగదు లావాదేవీల తీవ్రత దృష్ట్యా రంగంలోకి దిగిన ఈడీ, గత నవంబర్ 20వ తేదీన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. శ్రీనివాస్ సేకరించిన నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించారా లేదా విదేశాలకు తరలించారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
తక్కువ ధరకు ఇళ్లు వస్తాయనే ఆశతో కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టిన వందలాది మంది బాధితులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జయత్రి ఇన్ఫ్రా ఆస్తులను అటాచ్ చేసి, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే డబ్బులు ఈడీ వెనక్కి తప్పించదు. ఆ బాధితులకు డబ్బులు వెనక్కి రావడం దాదాపు అసాధ్యంగా మారుతోంది.
