పొగడ్తల్లో పీహెచ్‌డీ చేసిన జేసీ..! చంద్రబాబును ఇంతలా ఎవరూ పొగడలేదేమో..?

అనంతపురం ధర్మపోరాట దీక్షలో జేసీ దివాకర్ రెడ్డి.. మరో సారి తనదైన స్పీచ్ ఇచ్చారు. చంద్రబాబును ఏ స్థాయిలో పొగడాలో .. ఆ స్థాయిలో పొగిడి.. అంతే స్థాయిలో జగన్ ను విమర్శించేశారు. జగన్ ను.. ఎప్పుడూ.. ఏ బహిరంగసభలో ప్రసంగించినా.. మావాడు ..మా వాడు అంటూ ఉంటారు. అలాగే అనంతపురం ధర్మపోరాట సభలోనూ సంబోధించారు. మా వాడు జగన్ తిక్కోడు..కుల పిచ్చి ఎక్కువ.. కులంతో జగన్‌ సీఎం కావాలని అనుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. జగన్‌ జన్మలో సీఎం కాలేరని తేల్చి చెప్పేశారు. జగన్ కు కాళ్ల చూపు తప్ప.. ముందుచూపు లేదన్నారు. హిందూపురం ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.10 కోట్లు అడుగుతున్నాడుని విమర్శలు గుప్పించారు. ఇటీవలి కాలంలో.. హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్తగా..నవీన్ నిశ్చల్ ను తొలగించి .. టీడీపీ నుంచి వచ్చిన అబ్దుల్ ఘనీకి పదవి ఇచ్చారు. ఆయనకే అభ్యర్థిత్వం ఇవ్వబోతున్న ప్రచారం జరుగుతోంది. తనను రూ. పది కోట్లు జగన్ అడిగారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియా వైరల్ అయింది. దాని ప్రకారమే జేసీ ఈ విమర్శలు చేసినట్లుగా ఉన్నారు.

అదే సమయంలో సీఎం చంద్రబాబుపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రప్రజలు నిశ్చింతగా నిద్రపోవచ్చన్నారు. తరతరాల దారిద్ర్యం పోతుందన్నారు. నీళ్ల కోసం తాపత్రయపడుతున్న చంద్రబాబు నిజంగా ధన్యజీవి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ మోసం ఏపీ ప్రజల గుండెల్లో నాటుకుపోయిందన్నారు. అనంతలో అతి పురాతన ప్రాజెక్టులలో బీటీ ప్రాజెక్ట్ ఒకటి అని.. దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కలలు కన్న ప్రాజెక్ట్ అన్నారు. దాన్ని చంద్రబాబు సాకారం చేశారన్నారు. బీటీ ప్రాజెక్టును చూసి పైనుంచి సంజీవరెడ్డి సంతోషిస్తారని జేసీ అన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని తరతరాలుగా గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. నీళ్లివ్వడమనే మహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారని.. ఆయన మేధస్సుకు, ముందు చూపుకు జోహార్లన్నారు. .ఆయన కోసం కాదని.. మన కోసం.. మన పిల్లల కోసం… టీడీపీకి ఓటెయ్యాలని జేసీ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఒక మహాత్తరమైన కుట్ర జరుగుతున్న పరిస్థితిలో మొట్టమొదటిసారిగా మేల్కొని ఆ కుట్రను భగ్నం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నద్ధమయ్యారని జేసీ విశ్లేషించారు. కుట్రలు చేధించే విషయంలో చంద్రబాబు మొనగాడు.. మగాడని.. ఖచ్చితంగా నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధిస్తారని జేసీ పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలు వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్నారు. .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.