తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశాంతంగా ఉండే పరిస్థితే కనిపించడం లేదు. అయితే పెద్దారెడ్డితో లేకపోతే..సొంత ప్రభుత్వం నియమించిన పోలీసులతో లొల్లి పెట్టుకుంటారు. పెద్దారెడ్డి కొన్నాళ్ల నుంచి సైలెంట్ గా ఉండటంతో ఇప్పుడు ఆయనకు తీరిక దొరికిందేమో కానీ.. ఎఎస్పీ రోహిత్ కుమార్ పై విరుచుకుపడుతున్నారు. తాము ఏం చేసినా చూసీ చూడనట్లుగా ఉండాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఏఎస్పీ మాత్రం.. ఎవరైనా సరే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని అంటున్నారు.
తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి ప్రాంతంలో ఇటీవల ఓ ప్రభుత్వ కార్యాలయంలో జేసీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ASP రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు. ఇది జేసీని ఆగ్రహానికి గురి చేసింది. పవర్ గ్రిడ్ కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నాడని ఆరోుపించారు. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడన్నారు. ఆయన పోలీస్ యూనిఫాం వేసుకోరని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపాయి. ఎందుకంటే ఆయన అధికార పార్టీకి చెందిన నేత.
తాడిపత్రిలో వ్యాపార వర్గాలు, పరిశ్రమల నుంచి నుంచి పనులు, ఇతర కాంట్రాక్టుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ప్రభుత్వ పనులు చేసేవారి విషయంలో అయితే ఇంకా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటుంది. వారి వద్ద రాజకీయ నేతలు వసూళ్లకు పాల్పడుతూంటారు. వీటిని కంట్రోల్ చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో పోలీసులు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఏఎస్పీపై విరుచుకపడుతున్నారు. తాడిపత్రిలో ఏఎస్పీ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గలేదు.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని ఆయన సమర్థుడు కాదని అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎవరూ చెప్పినా వినే పరిస్థితి లేకపోవడంతో అందరూ సైలెంట్ గా ఉంటున్నారు.
