కాంగ్రెస్ పార్టీ జగిత్యాల సమస్యకు పరిష్కారం లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై దాదాపుగా తిరుగుబాటు చేసిన జీవన్ రెడ్డి .. బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ నెల 25వ తేదీన తన రాజీనామాను ప్రకటించే అవకాశం ఉంది.నలభై ఏళ్లుగా జగిత్యాలకు జీవన్ రెడ్డి మాత్రమే లీడర్ గా ఉన్నారు. మరో లీడర్ ఎదగలేదు. వరుగా ఆరు సార్లు గెలిచిన ఆయన ఓ సారి ఓడిపోయాక మళ్లీ గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో అసెంబ్లీకి.. తర్వాత పార్లమెంట్ కూ టిక్కెట్ ఇచ్చినా గెలవలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇక తనకు ప్రాధాన్యం ఉండదని ఆయన ఫీలవుతున్నారు. రాజకీయంగా సంజయ్ కుమార్తో పోరాడిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే నాయకుడికి పార్టీలో పెద్దపీట వేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుంచి చైర్పర్సన్ ఎంపిక వరకు సంజయ్ కుమార్ మాటే చెల్లుబాటు కావడం, జీవన్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో తనకు అవమానాలు ఎదురవుతున్న పార్టీలో తాను ఉండలేనని చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ లో ఉంటే ఎలాంటి పదవులు రావని..నియోజకవర్గంలో కూడా నిలువ నీడ ఉండదని జీవన్ రెడ్డి ఫిక్సయ్యారు. అందుకే బీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లారు. కేసీఆర్, కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డితో మంతనాలు జరిపారని, ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి వంటి నేత పార్టీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో తమ బలం పెరుగుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే తన అనుచరులు, ఆత్మీయులతో భేటీ అయిన జీవన్ రెడ్డి, వారి సలహా మేరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ నెల 25వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి, కాంగ్రెస్కు అధికారికంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. జగిత్యాలలో తన బలాన్ని నిరూపించుకునేలా భారీ బలప్రదర్శనతో ఇతర పార్టీలోకి వెళ్లాలని ఆయన యోచిస్తున్నారు.

