ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా వెలిగిన తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు, తన మాట చెల్లుబాటు కాకపోవడంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది, కార్యకర్తల అభిప్రాయం తీసుకుని నిర్ణయం ప్రకటిస్తానని తాజాగా ప్రకటించారు. ఆయన ప్రకటననూ ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన బెదిరింపులే కానీ ఎక్కడికి పోలేరని ఎక్కువ మంది నమ్మకం.
గత కొంతకాలంగా ఆయన పదే పదే ఇలాంటి హెచ్చరికలు చేయడం తప్ప, ఖచ్చితమైన అడుగు వేయడం లేదు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతకు పార్టీలో సముచిత గౌరవం దక్కడం లేదన్నది వాస్తవమే అయినా, కేవలం బెదిరింపుల తో హైకమాండ్‌ను లొంగదీసుకోవాలని చూడటం సాధ్యం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో చేరికలు, స్థానిక రాజకీయ ప్రాబల్యం విషయంలో ఆయనకు, అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరిగింది. కార్యకర్తల పేరుతో కాలయాపన చేయడం కంటే, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడమే ఆయన రాజకీయ భవిష్యత్తుకు , ఆయనపై నమ్మకం ఉంచిన అనుచరులకు మేలు చేస్తుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఎవరూ ఎవరి కోసం ఆగే పరిస్థితి లేదు. జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్‌లోనే కొనసాగించాలా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయమే అయినా, మాటిమాటికి ఆలోచిస్తా.. చర్చిస్తా అనడం వల్ల ఆయనపై సీరియస్ నెస్ తగ్గిపోతోంది. ఒక సీనియర్ నేతగా గౌరవప్రదమైన నిష్క్రమణ లేదా రాజీలేని పోరాటం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవడమే ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక మార్గమని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
