కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు జీవన్ రెడ్డి ప్రస్తుతం పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గాంధీ భవన్ వేదికగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వ అహంపై దెబ్బకొడుతున్నాయి. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి గట్టి మద్దతుదారుగా నిలిచిన జీవన్ రెడ్డి, నేడు అదే నాయకత్వం తనను విస్మరించడంపై భగ్గుమంటున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తన వంటి సీనియర్లను గౌరవించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి అసంతృప్తి మాత్రమే కాదు, పార్టీ అంతర్గత క్రమశిక్షణకు జరుగుతున్న పెద్ద డ్యామేజ్.
జీవన్ రెడ్డి ఆగ్రహానికి ప్రధాన కారణం ఆయన సొంత నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు. జగిత్యాలలో ఆయన ఎవరిపైన దశాబ్దాలుగా పోరాటం చేశారో, అటువంటి నేతలను ఆయనకు కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవడం జీవన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, నియోజకవర్గంలో పాత శత్రువులకే పెత్తనం అప్పగించడం ఆయన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. తన రాజకీయ ఆసక్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర నాయకత్వం, ఆయనను పక్కన పెట్టేయడం సీనియర్ నేతకు మింగుడుపడటం లేదు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను కూడా తనకు ఇబ్బందికరంగా ఉన్న నేతలకే అప్పగించడం జీవన్ రెడ్డికి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పార్టీలో తనను ఒంటరిని చేస్తున్నారనే ఉద్దేశంతో, ఆయన ఇప్పుడు పార్టీకి ఎంత నష్టం చేయాలో అంతా బహిరంగంగానే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్ అయోమయంలో పడటం, సీనియర్ నేతలే రోడ్డెక్కడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతోంది.
జీవన్ రెడ్డి వంటి కీలక నేతను బుజ్జగించడంలో, తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోకపోగా, వారిని కించపరిచేలా వ్యవహరించడం వల్ల పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. జీజీవన్ రెడ్డి అసంతృప్తిని తగ్గింంచకపోతే జగిత్యాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని కొంత మంది సీనియర్లు అంటున్నారు.
