అమెరికా సంపన్న వ్యాపారవేత్త, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయి ఏళ్లు దాటుతున్నా, ఆయన వదిలిపెట్టిన ఎప్స్టీన్ ఫైల్స్ మాత్రం ప్రపంచ దేశాధినేతలకు, బిలియనీర్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, వేలకొద్దీ వీడియోలు, లక్షా ఎనభై వేల ఫోటోలను బయటపెట్టడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది.
ప్రపంచ ప్రముఖుల చీకటి లీలల గుట్టురట్టు!
జెఫ్రీ ఎప్స్టీన్ అంటే కేవలం ఒక కోటీశ్వరుడు మాత్రమే కాదు, ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన వ్యక్తులందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఒక వ్యూహకర్త . తన సొంత ద్వీపానికి ప్రముఖులను ఆహ్వానించి, అక్కడ మైనర్ బాలికలతో లైంగిక సేవలు ఏర్పాటు చేసేవాడనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు బయటకు వచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్ అంటే.. ఆయన డైరీలో ఉన్న పేర్లు, ఫోన్ కాంటాక్ట్స్, ఆయన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించిన వారి జాబితా . దీనిని లోలిత ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు . ఈ ఫైల్స్ బయటకు రావడం అంటే.. ఇన్నాళ్లూ నీతి సూత్రాలు వల్లించిన ఎందరో ప్రముఖుల ముసుగులు తొలగిపోవడమే.
ఎన్నో పేర్లు – కానీ అందరూ తప్పుడు పనులు చేసేవాళ్లేనా?
ఈ ఫైల్స్‌లో ఉన్న పేర్లు చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ..ఇప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుకొని, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ , బ్రిటన్ రాజకుటుంబీకుడు ప్రిన్స్ ఆండ్రూ , విఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ వరకు ఎందరో ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా విడుదలైన పత్రాల్లో బిల్ గేట్స్‌కు కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయని ఎప్స్టీన్ మెయిల్స్ పంపినట్లు రావడం సంచలనం సృష్టిస్తోంది. అలాగే ప్రిన్స్ ఆండ్రూ ఒక మహిళతో అసభ్యకర స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రముఖులంతా ఎప్స్టీన్తో స్నేహం ఉన్న మాట వాస్తవమే అని ఒప్పుకున్నా, అతడి చీకటి పనులతో తమకు సంబంధం లేదని అంటున్నారు.
రహస్య వీడియోలు తీసిన ఎప్స్టీన్
ఈ కథలో అసలైన ట్విస్ట్ ఎక్కడ ఉందంటే.. ఎప్స్టీన్ తన వద్దకు వచ్చే ప్రముఖుల బలహీనతలను కనిపెట్టి, వారు మైనర్లతో గడిపే సమయాలను రహస్యంగా వీడియో తీసేవాడని ప్రచారం జరుగుతోంది. ఇలా సేకరించిన వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని చెబుతున్నారు. తాజాగా బయటపడిన 2000 వీడియోల్లో ఏ ఏ దిగ్గజాల శృంగార లీలలు ఉన్నాయో అన్న భయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను వణికిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ ఫైల్స్ ఒక్కోటిగా తెరుచుకుంటుంటే హాలీవుడ్ స్థాయి థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
30 లక్షల పేజీల డేటాలో ఎవరి జాతకం ఎలా మారుతుందో అని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. తన దగ్గరకు వచ్చిన మైనర్లను ప్రముఖులకు ఎర గా వేసి, వారిని తన గుప్పిట్లో ఉంచుకున్న ఎప్స్టీన్.. జైలులో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఈ రహస్యాలు బయటకు రాకూడదని ఎవరైనా అతడిని అంతం చేశారా అనే అనుమానాలు ఇప్పటికీ నివురు గప్పిన నిప్పులాగే ఉన్నాయి. త్వరలో ఈ అంశంపై హాలీవుడ్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు.