హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాను కేంద్రమంత్రిననే విషయాన్ని మరిచిపోయి ఏపీ రాష్ట్రానికి ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీతిఆయోగ్ బృందాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఏపీకి చెందిన అంశాలపై మాట్లాడటంపై మండిపడ్డారు. దీనిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర విభజనలో ఏపీ నష్టపోయిందన్నదీ నిర్వివాదాంశం. ఆవులో తల ఒకరికి, పొదుగు మరొకరికి పంచినట్లు రాష్ట్ర విభజన చేశారని, బిడ్డను చంపి తల్లిని బతికించారని ప్రధాని మోడితో సహా దేశంలోని పలువురు నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ఈ విషయంపై మాట్లాడుతూ, విభజన వలన ఏపీకి హైదరాబాద్‌లాంటి ఆదాయ వనరు లేకుండా పోయిందని అన్నారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, అనేక ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ఆదాయాలు ఉన్న హైదరాబాద్‌లాంటి రాజధాని నగరం ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్‌కు కనీసం 20-30 ఏళ్ళు పడుతుంది. మరోవైపు తెలంగాణ దేశంలోనే సంపన్న రాష్ట్రంగా అవతరించింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వ్యక్తిగా వెంకయ్యనాయుడు ఆ రాష్ట్రానికి సాయం చేయాలనుకోవటం తప్పని ఎవరూ అనలేరు. జన్మభూమికి సాయంచేయటం ఎవరికైనా కనీస బాధ్యత. కేంద్ర కార్మిక-ఉపాధిశాఖ మంత్రి దత్తాత్రేయకు ఏదైనా అవకాశం వస్తే – చట్టం పరిధికి లోబడి తెలంగాణకు సాయం చేయాలనుకుంటే – హర్షించాలి. అలాగే వెంకయ్య నాయుడు తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంటే నిలదీయాలి.
ఇది చూస్తుంటే ఒక పిట్టకథ గుర్తురాకమానదు. ఇద్దరు మునులు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నారు. వారిలో ఒక మునికి అసూయపాలు కాస్త ఎక్కువ. ఆయన ప్రతిదానికీ రెండోమునితో పోటీ పడుతుండేవాడు. రెండోముని ఏది చేస్తే దానికి రెట్టింపు చేయటానికి ప్రయత్నిస్తుండేవాడు. వారి తపస్సుకు మెచ్చి కొంతకాలానికి ఇద్దరినీ అనుగ్రహించాలని దేవుడు నిర్ణయించాడు. ఒకరితర్వాత ఒకరిని ఆయన వరాలు కోరుకొమ్మని అడుగుతూ ముందుగా రెండో ముని దగ్గరకు వెళ్ళాడు. తన సహచరుడు ఏమడుగుతాడో తెలుసుకాబట్టి తనకు ఒక కన్ను పోగొట్టమని రెండో ముని అడిగాడట. దేవుడు తథాస్తు అన్నాడట. తర్వాత మొదటిముని దగ్గరకు వెళితే, రెండో మునికి ఏదిస్తే దానికి రెట్టింపు ఇవ్వమని కోరాడట. రెండు కళ్ళూ తీసేశాడట దేవుడు.