తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో వారంలో రానున్న సమయంలో ప్రముఖ గీత రచయిత, కవి వైరముత్తు కు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీ ప్రకటించారు. తమిళనాడులో బీజేపీ ఎప్పుడూ తమిళ వ్యతిరేక పార్టీ అనే ముద్రను ఎదుర్కొంటోంది. ఈ ముద్రను చెరిపేసి, తాము తమిళ భాషకు, సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని నిరూపించుకోవడానికి వైరముత్తుకు ఈ పురస్కారం ప్రకటించడం ఒక వ్యూహాత్మక అడుగు అనుకోవచ్చు.
24 ఏళ్ల తర్వాత తమిళ రచయితకు జ్ఞానపీఠ్ అవార్డు
గత 24 ఏళ్లుగా ఏ తమిళ రచయితకూ జ్ఞానపీఠం దక్కలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ పురస్కారం రావడం ద్వారా, తమిళ ఓటర్ల మనసు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పాల్సిన పని లేదు. వైరముత్తుకు డిఎంకె తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, ఆయనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పురస్కారం దక్కేలా చేయడం ద్వారా విపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.
గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వైరముత్తు
గతంలో వైరముత్తు చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యాయి. అయినప్పటికీ బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతు పలకడం వెనుక ఒక బలమైన రాజకీయ కారణం ఉంది. తమిళనాడులో హిందూత్వ కార్డు కంటే తమిళ కార్డు బలమైందని బీజేపీ గుర్తించింది. కరుడుగట్టిన ద్రవిడ వాదాన్ని కూడా సానుకూలంగా మార్చుకోవడానికి వైరముత్తు వంటి వ్యక్తిని ఒక వారధి గా వాడుకోవాలని చూస్తోందని.. ఈ ఎత్తుగడతో అటు మేధావులను, ఇటు గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తోందని అంటున్నారు.
సింగర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు
ఈ పురస్కార ప్రకటనతో మరోవైపు తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. వైరముత్తుపై గతంలో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. గాయని చిన్మయి వంటి వారు బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడే బీజేపీ, ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి అత్యున్నత పురస్కారం ఎలా ఇస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
