నకిలీ మద్యం కేసులో ఏ వన్ నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు స్టేట్ మెంట్ ఆధారంగానే పోలీసులు జోగి రమేష్ ను అరెస్టు చేయలేదని తెలుస్తోంది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును కూడా అరెస్టు చేశారు. అద్దెపల్లి చెప్పిన వివరాల ప్రకారం పూర్తి స్థాయి ఆధారాలు, నగదు లావాదేవీలు లభించాయి. జోగి రిమేశ్ సోదరుడు రాము ద్వారా నకిలీ మద్యం వ్యాపారాన్ని నిర్వహించారని క్లారిటీ వచ్చింది. ఉదయం అదుపులోకి తీసుకున్న జోగి రమేష్ పీఏను.. విచారణ తర్వాత పంపించేశారు.
జోగి రమేష్ వైసీపీ హయాంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం విక్రయించారు. లిక్కర్ స్కామ్ లో ఇదొక కోణంగా భావిస్తున్నారు. ఎన్ని జిల్లాల్లో వీరి వ్యాపారం సాగిందనేది వెల్లడి కానుంది., తాను చేసిన తప్పుడు వ్యాపారాలను కూటమి ప్రభుత్వానికి అంటించడానికి ఆయన చేసిన కుట్ర.. ఆయన పాత వ్యాపారాలను వెలుగులోకి తీసుకు వస్తోంది. ఆయన చేసిన కుట్ర ఆయనకే చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
గతంలో చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు అగ్రిగోల్డ్ స్థలాలను కాజేయడం వరకూ చాలా నేరాలపై కేసులు ఉన్నాయి. కానీ ఆయనను పోలీసులు అరెస్టు చేసే వరకూ వెళ్లలేదు. ఇదే అలుసుగా చేసుకుని ఆయన తన నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి వాడుకున్నారు. ఇది చాలా పకడ్బందీగా జరిగింది. ఎంతగా అంటే.. ఏపీవ్యాప్తంగా నకిలీ మద్యం అమ్ముతున్నారని వ్యవస్థీకృతంగా చేసిన ప్రచారమే దీనికిసాక్ష్యం.
జోగి రమేష్ అరెస్టు అక్రమం అని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ నేతల ఆర్తనాదలను అందరూ విచిత్రంగా చూస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా.. గతం మర్చిపోతే ఎలా అనుకుంటున్నారు.
