నకిలీ మద్యం తయారు చేయించి..ప్రభుత్వంపై బురద చల్లేందుకు అతి పెద్ద కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయాడు జోగి రమేష్. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అసలు విషయాన్ని బయట పెట్టారు. ఎక్కడ ములకల చెరువు..ఎక్కడ ఇబ్రహీంపట్నం అన్న అంశంపై తీగ లాగగానే అసలు కుట్రలు బయటపడ్డాయి. రాయలసీమలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు అంతా చేయించారని అనుకుంటున్న సమయంలో ఇబ్రహీంపట్నంలో డెన్ అంటూ.. జోగి రమేష్ చేసిన హడావుడితో ఆయనే క్లూ ఇచ్చారు.
అద్దేపల్లి జనార్దన్ రావును ఆఫ్రికాకు పంపించి ..ఇక రావొద్దని జోగి రమేష్ సలహా ఇచ్చారు.కానీ తమను నిండా ముంచుతున్నారని తెలిసిన తర్వాత ఆ జనార్దన్ రావు వచ్చేశారు. పోలీసులకు అంతా చెప్పేశారు. ఇప్పుడు పచ్చి వెలక్కాయ గొంతులో పడటంతో జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి ప్రమాణాల సవాల్ చేస్తున్నారు. భార్య బిడ్డలతో తిరుమలకు వచ్చి ప్రమాణం చేస్తానని అంటున్నారు. రిమాండ్ రిపోర్టులో తన పేరు లేదని.. జనార్దన్ ను బెదిరించి ఆ వీడియో తీయించారని అంటున్నారు.
కానీ ఒక్క అద్దెపల్లి జనార్దన్ రావు స్టేట్ మెంట్ తోనే అంతా జరిగిపోదుగా.. ఆధారాలు కూడా ఉంటావు. వాటిని కాదని.. జోగి రమేష్ అనలేరు. వైసీపీ హయాంలోనూ అక్రమ మద్యంతో పెద్ద ఎత్తున సంపాదించారు. ఆ వివరాలు కూడా వెలుగులోకి రానున్నాయి. ఇప్పుడు సిట్ అధికారులు ఎక్కడ ప్రమాణాలు చేయించాలో అక్కడే చేయిస్తారు. చంద్రబాబు, లోకేష్ కు సవాల్ చేసినంత మాత్రాన.. చేయాల్సిన చోట ప్రమాణాలు చేయకుండా తప్పించుకోలేరు కదా అన్న సెటైర్లు టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి.