ఏ రోటికాడ ఆ పాట పాడే అలవాటు అమెరికాకి ఉంది. అదే మరోమారు నిరూపించుకొంటున్నట్లుగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి జాన్ కెర్రీ మాట్లాడారు. ఆయన నిన్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుహ్మా స్వరాజ్ తో సమావేశం అయిన తరువాత డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “నేను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తో మాట్లాడాను. ఉగ్రవాద నిర్మూలనకి గట్టిగా కృషి చేయాలని వారిరువురిని కోరాను. 2008 ముంబై దాడులు, 2016పఠాన్ కోట్ దాడుల సూత్రధారులని పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టవలసి ఉందని గట్టిగ చెప్పాను. భారత్ మాకు చాలా ఆప్తురాలు. అందుకే భారత్ కి ఎప్పుడూ అండగా నిలబడతాము. భారత్ కి ఏ దేశం నుంచి ఏ రూపంలో ఉగ్రవాద సమస్యని ఎదుర్కోవలసి వచ్చినా అమెరికా అండగా నిలబడుతుంది. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అని వేరేగా ఉండరు. ఉగ్రవాదులు అందరూ చెడ్డవారే. కనుక ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అణచివేసేందుకు అమెరికా ముందుంటుంది,”అని కెర్రీ అన్నారు.
కెర్రీ ఈవిధంగా చెప్పడం మొదటిసారి కాదు ఆఖరిసారి కాదు. 2008లో ముంబైపై జరిగిన దాడులకి పాల్పడిన ఉగ్రవాదులని అరెస్ట్ చేయాలని ఆయన 2016లో కూడా ఇంకా చెపుతూనే ఉండటం గమనిస్తే అమెరికా చిత్తశుద్ధి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అదే అమెరికా ట్విన్ టవర్స్ పై తాలిబాన్లు దాడి చేసిన తరువాత కొన్ని రోజుల వ్యవధిలోనే వారిపై అమెరికా విరుచుకుపడుతూ వారిని మట్టుబెట్టడం ప్రారంభించింది. చివరికి ఆ కుట్రకి పాల్పడిన బిన్ లాడెన్ పాకిస్తాన్ లో దాగోన్నాడని కనిపెట్టి అర్దరాత్రి పాక్ భూభాగంలో ప్రవేశించి మిలటరీ ఆపరేషన్ చేసి మరీ అతన్ని కూడా మట్టుబెట్టింది. కానీ పాకిస్తాన్ భారత్ పై వరుసగా దాడులు చేస్తున్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ, నేటికీ అమెరికా పాకిస్తాన్ కి బారీ ఆర్ధిక సహాయం అందిస్తూనే ఉంది. ఉగ్రవాదంపై పోరుకోసం అంటూ యుద్ద సామాగ్రి కూడా అందిస్తూనే ఉంది.
పాకిస్తాన్ కి చేయవలసిన సహాయం చేస్తూనే అమెరికా ప్రతినిధులు భారత్ వచ్చినప్పుడు, భారత ప్రభుత్వాన్ని ఓదార్చేందుకు ఇటువంటి పడికట్టు పదాలు నాలుగు చిలకలాగ వల్లించి వెళ్లిపోతుంటారు. భారత్ చాలా అల్పసంతోషి కనుక ఆ మాటలకే సంతోషపడుతుంటుంది. మరో పదేళ్ళ తరువాత అమెరికా ప్రతినిధులు ఎవరైనా భారత్ వచ్చినప్పుడు అప్పుడు కూడా2008లో ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్ దాడుల గురించి పాకిస్తాన్ని హెచ్చరిస్తూనే ఉంటారు. ఈలోగా పాక్ మళ్ళీ దాడులకి పాల్పడినట్లయితే, దానిని ఆ జాబితాలో చేర్చి వల్లె వేసి చేతులు దులుపుకొని వెళ్లిపోతుంటారు. భారత్ పట్ల పాక్ వైఖరి, పాక్ పట్ల అమెరికా వైఖరి మారనంత వరకు ఇటువంటి కబుర్లు ఎన్ని చెప్పుకొన్నా ఏమీ ప్రయోజనం ఉండదు.