జూబ్లిహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో మలుపులకు కారణం కాబోతోంది. అందుకే ఆస్థానంలో జరిగే ఉపఎన్నికపై అందరి దృష్టి పడింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, అధికార పార్టీగా గెలవాల్సిన అవశ్యకతను కాంగ్రెస్, పుంజుకుంటున్నామని నిరూపించడానికి బీజేపీకి ఈ ఉపఎన్నిక చాలా కీలకంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే జూబ్లిహిల్స్‌లో పరిస్థితి ఎలా ఉందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. పూర్తిగా నగర నియోజకవర్గం కావడం.. బస్తీల ఓటర్లు ఎక్కువగా ఉండటం, మైనార్టీలు ఫలితాలు తేల్చే స్థాయిలో ఉండటంతో సమీకరణాలే కీలకంగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు.
బీఆర్ఎస్ – ఏదీ కలసి రావడం లేదు !
జూబ్లిహిల్స్ భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ సీటు. మాగంటి గోపీనాథ్ మూడోసారి ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఓ సారి టీడీపీ నుంచి రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. మొదటి సారి టీడీపీ గెల్చినప్పుడు రెండో స్థానంలో మజ్లిస్ ఉంది. కాంగ్రెస్ మూడో స్థానంలో బీఆర్ఎస్ నాలుగో స్థానంలో ఉన్నాయి. వాస్తంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అక్కడ అంతే. కొత్త ఏర్పడిన ఏర్పడిన కొత్తలో ఉన్న సెంటిమెంట్ ప్రకారం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 18వేలు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయలేదు. బీఆర్ఎస్కు పరోక్షంగా మద్దతు ఇచ్చింది. మాగంటి గోపీనాథ్ రెండు సార్లు విజయంలో మజ్లిస్ కీలకం. ఇప్పుడు మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్టుగా లేదు. పలువురు నేతలు మాగంటి గోపీనాథ్ జీవించి ఉన్నప్పుడే ఆయనతో విబేధించి పార్టీ నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి వల్ల ఎంత ఉపయోగమో బీఆర్ఎస్కే అర్థం కావడం లేదు. కనీసం సానుభూతి అయినా గట్టెక్కిస్తుందన్న ఆశతో.. మాగంటి సునీతకే టిక్కెట్ ఖరారు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మజ్లిసే బలం
కాంగ్రెస్ పార్టీ అధికార హోదాలో ఉంది. గత ఎన్నికల్లో అజహర్‌కు చివరి క్షణంలో టిక్కెట్ ఖరారు చేశారు. అయినప్పటికీ ఆయన రెండో స్థానంలో నిలిచారు. పదహారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మజ్లిస్ అభ్యర్థి బరిలో లేరు. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సహకరించారు. అజహర్ కోసం కొంత క్రాస్ ఓటింగ్ జరిగినా అది గెలుపు ఇవ్వలేదు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మజ్లిస్ పార్టీనే నిలుస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహకరించడం మజ్లిస్ నైజం. ఓట్లు చీల్చడానికి అయినా.. ఓట్లు వేయించడానికి అయినా.. మజ్లిస్ బాగా ఉపయోగపడుతుంది. స్థానికంగా బస్తీల్లో పట్టు ఉన్న నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నమ్మకంతో ఉంది. పార్టీలో అంతర్గత సమస్యలు పెద్దగా ప్రభావం చూపవని అనుకుంటున్నారు.
బీజేపీ పెద్దగా ప్రయత్నించడం లేదు !
గతంలో ఉపఎన్నికలు అంటే.. బీజేపీ హడావుడి ఎక్కువగా ఉండేది. దుబ్బాక అయినా.. హుజూబారాబాద్ అయినా.. మునుగోడు అయినా ఉపఎన్నికల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సాగేది. కానీ ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికనపై పెద్దగా దృష్టి పెట్టలేదు. సాధారణంగా ఉపఎన్నిక వస్తే చాలా పెద్ద కసరత్తు ఆ పార్టీ చేస్తుంది. ఈ సారి మాత్రం చేయడం లేదు. అభ్యర్థిని నిలబెడుతుంది. ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. అది ఏ పార్టీకి మారదు. అందుకే బలంగా ఓట్లను చీలుస్తుంది కానీ.. గెలుపు రేసులో ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
మొత్తంగా జూబ్లిహిల్స్ లో పోటీ .. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే సాగనుంది. మజ్లిస్ మద్దతు, అధికార పార్టీ అడ్వాంటేజ్ , రేవంత్ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప అడ్వాంటేజ్ చూపిస్తున్నాయని అనుకోవచ్చు.