జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు క్రైమాక్స్ కు చేరుకున్నాయి. ప్రచారం ముగిసిపోవడంతో పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి. సాధారణంగా ఈ విషయంలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. బీజేపీ పెద్దగా ప్రయత్నించ లేదు. ఈ ఫలితం తమపై ఎలాంటి ప్రభావం చూపదని అనుకున్నారేమో కానీ.. ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నడిచింది. ఈ రెండు పార్టీలు తాడోపేడో అన్నట్లుగా పోరాడటానికి కారణం.. ఫలితం ఆయా పార్టీలపై చాలా ప్రభావం చూపించనుండటమే.
బీఆర్ఎస్ మనుగడకు కీలకమైన ఎన్నిక
జూబ్లిహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది. జూబ్లిహిల్స్ మొత్తం పార్టీ నేతలతో నింపేసింది. గల్లీ గల్లీలో ప్రచారం చేసింది. ప్రచార వ్యూహాలు కూడా భిన్నంగానే పాటించారు. తమది ప్రభుత్వం కాదు కాబట్టి తమకు ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న ప్రజల్లో వస్తుంది. వాటన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే పథకాలు అమలవుతాయని.. హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఉంటాయని ప్రజలకు చెప్పారు. ఖర్చు కూడా పార్టీ పరంగా ఏ మాత్రం తక్కువ పెట్టలేదు. మాగంటి సునీత కాకుండా.. కేటీఆరే అభ్యర్థి అన్నట్లుగా బీఆర్ఎస్ పోటీ పడింది. దీనికి కారణం ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రజలు భావిస్తారు. ఇప్పటికే సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ లో డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఇప్పుడు జూబ్లిహిల్స్ లో కూడా అదే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పునాదులు కదిలిపోయాయని అనుకుంటారు. లేదు ..తాము బౌన్స్ బ్యాక్ అవుతామని ప్రజలకు నమ్మకం కలిగించాలంటే జూబ్లిహిల్స్ లో గెలవక తప్పని పరిస్థితి. అందుకే సర్వశక్తులు ఒడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ఉండాలంటే గెలవక తప్పదు!
కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన బలహీనంగా ఉంటే సీనియర్ నేతలంతా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రులం అనే అనుకుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఉపఎన్నికలో గెలిచి తీరాలి. కారణం ఏదైనా రేవంత్ రెడ్డిని నియంత్రించడానికి హైకమాండ్ చాలా ప్రయత్నాలు చేస్తోంది.ఇతర లీడర్లను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సమయంలో ఉపఎన్నికలో ఓడిపోతే రేవంత్ తో సీనియర్ నేతలు మరింతగా ఆడుకుంటారు. అంటే ఉపఎన్నికల్లో ఓటమి ప్రభుత్వాన్ని బలహీనపరుస్తుంది. వ్యతిరేకత పెరిగిపోయిందన్న ప్రచారం ఉద్దృతం అవుతుంది. ఇలాంటి వాటిని అవకాశం ఇవ్వకూడదంటే గెలిచి తీరాలి. అందుకే రేవంత్ కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకుని తానే ఇంచార్జ్ అన్నట్లుగా ప్రయత్నించారు.
బీజేపీ వ్యూహాలు భిన్నం – అర్థం చేసుకోవడం కష్టం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా ఉందని అనుకున్న సమయంలో హఠాత్తుగా ఆయనను మార్చేసింది బీజేపీ హైకమాండ్ . కాంగ్రెస్ గెలవడానికి రోడ్ మ్యాప్ అక్కడే ప్రారంభమయింది. ఇప్పుడు జూబ్లిహిల్స్ లోనూ తమను తాము నియంత్రించుకున్నారు. క్రేజ్ ఉన్న బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నా ప్రయత్నించలేదు. బండి సంజయ్ ను కూడా ప్రచారంలో నియంత్రించారు. కానీ ఈ ఎన్నికల్లో ఫలితం తాము అనుకున్నట్లుగా వస్తేనే తమ భవిష్యత్ రాజకీయాలు ఆటంకం లేకుండా సాగుతాయని అనుకుంటున్నారు. తాము గెలవకుండా ఇతరుల గెలుపు ద్వారా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా చూసినా జూబ్లిహిల్స్ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది.
