జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ సమీకరణాల సన్నాహాల్లో ఉన్నాయి. మజ్లిస్ మా మిత్రపక్షమని..తమకు సహకరిస్తుందని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నమ్మకంగా ప్రకటించుకున్నారు. అలా ప్రకటించుకోవాల్సిన అవసరం వచ్చింది మరి. మజ్లిస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహకరిస్తుంది. కానీ ఎంత మనస్ఫూర్తిగా అన్నదానిపైనే.. . ఆ వర్గం వారి ఓట్ల బదిలీ ఆధారపడి ఉంటుంది. అందుకే మజ్లిస్ సహకారంపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మజ్లిస్ పోటీ చేస్తే.. ?
జూబ్లిహిల్స్ లో మజ్లిస్ పోటీ చేయడం లేదు. నిజంగా పోటీ చేసే ఆలోచన ఉంటే ఆ విషయాన్ని ఓవైసీ ఇప్పటికే ప్రకటించి ఉండేవారు. మజ్లిస్ కు జూబ్లిహిల్స్ లో మంచి బలం ఉంది. పోటీ చేస్తే ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేస్తారు. బస్తీల్లో ఇతర ప్రాంతాల ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపరేమో కానీ ముస్లింలు మాత్రం ఖచ్చితంగా ఓటు వేస్తారు. 2014లో మజ్లిస్ పోటీ చేసినప్పుడు రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు నవీన్ యాదవే పోటీ చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేసులో ఉన్నారు. మజ్లిస్ ఆ తర్వాత పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా పోటీ చేయడం లేదు. పాతబస్తీలో తమ జోలికి రాకుండా ఉండేలా.. ఇలా ఒప్పందాలు చేసుకుంటూ ఉంటుంది.
సంపూర్ణంగా సహకరిస్తే కాంగ్రెస్‌కు ప్లస్
మజ్లిస్ సంపూర్ణంగా కాంగ్రెస్ కు సహకరిస్తే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మజ్లిస్ కానీ.. ఓవైసీ కానీ ఎప్పుడూ ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించరు. అంతా లోపాయికారీగానే రాజకీయం జరిగిపోతుంది. వారి కమ్యూనిటీలోకి సందేశం అలా పంపుతారు. కాంగ్రెస్ విషయంలో సంపూర్ణంగా సహకరిస్తే.. ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. విజయాన్ని దగ్గర చేస్తుంది.
బీజేపీ ఉత్సాహంగా లేకపోవడం దేనికి సంకేతం ?
బీజేపీ చేస్తున్న రాజకీయం ఆ పార్టీ సానుభూతిపరుల్లో సందేహాలకు కారణం అవుతోంది. ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్న ప్రశ్న వస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.. బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్ఎస్ కు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. టీడీపీ చాలా కాలంగా జూబ్లిహిల్స్ లో యాక్టివ్ గా లేదు. కమ్మ సామాజిక వర్గం మద్దతు .. మాగంటి గోపీనాథ్ సతీమణికి ఉంటుందని ఆ పార్టీ ఆశపడుతోంది. మొత్తంగా జూబ్లిహిల్స్‌లో రాజకీయ పార్టీల రాజకీయం కంటే.. ఈ సమీకరణాలే ఫలితాలను తేల్చే ఆవకాశాలు కనిపిస్తున్నాయి.