జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ప్రచారం హైవోల్టేజ్కు చేరుకుంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని కేటీఆర్, కాంగ్రెస్ ప్రచారాన్ని రేవంత్, బీజేపీ ప్రచారాన్ని కిషన్ రెడ్డి లీడ్ చేస్తున్నారు. మూడు పార్టీల మధ్య హోరాహోరీగా జరగాల్సిన పోరు కాస్తా ఓ పార్టీ ఎవరితో కుమ్మక్కు అయింది.. ఆ పార్టీ ఎవర్ని గెలిపించడానికి ప్రయత్నిస్తోంది అన్న దిశగా చర్చ ప్రారంభమయింది. ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని రేవంత్ అంటున్నారు. రేవంత్ రెడ్డినే బీజేపీతో టై అప్ అయ్యారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఈ వాదోపవాదాల్లో జోక్యం చేసుకోవడం లేదు. రెండు పార్టీలను విమర్శిస్తూ సాదాసీదాగా ప్రచారం చేసుకుంటూ పోతోంది.
బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేస్తున్న రేవంత్
రెండు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ బంధాన్ని ఎక్స్పోజ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్ గుప్పిట్లోకి వెళ్లిందని నమ్మిన తర్వాత ఆయన అప్రమత్తమయినట్లుగా కనిపిస్తోంది. అందుకే కేటీఆర్ అరెస్టు, కాళేశ్వరం విచారణలు చేయకపోవడం వంటి వాటిని తెరపైకి తీసుకు వచ్చి టార్గెట్ చేస్తున్నారు. పోలింగ్ జరిగే నాటికి అంటే పదకొండో తేదీ కల్లా కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు అనుమతిని గవర్నర్ ఇవ్వాలని అంటున్నారు. సీబీఐ విచారమ చేయించాలని సవాల్ చేస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో పాతిక వేల ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఈ సారి డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేస్తున్నారు. సీఎం రేవంత్ ఇదే మాట చెప్పారు. డిపాజిట్ పోగొట్టుకోవడానికే పోటీ చేస్తున్నారని.. కాంగ్రెస్ పై కుట్ర చేసి బీఆర్ఎస్ ను గెలిపించడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ అంగీకరించడం వల్లే ఇదంతా జరుగుతోందని చెబుతున్నారు.
మోడీతో రేవంత్ రెడ్డి టైఅప్ అయ్యారని కేటీఆర్ రివర్స్ కౌంటర్
రేవంత్ రెడ్డి విమర్శలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ హైకమాండ్ కు అనుమానం కూడా వచ్చేలా మోడీతో టై అప్ అయింది రేవంత్ రెడ్డేనని అంటున్నారు. బడే భాయ్ తో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీని ముంచే రాజకీయాలు చేస్తున్నారుని విమర్శిస్తున్నారు. బీజేపీ..కాంగ్రెస్ కు సహకరిస్తుందంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రజలు కూడా నమ్మరు. అందుకే కేటీఆర్ వ్యూహాత్మకంగా రేవంత్, మోదీ కలిసిపోయారని విమర్శలు చేస్తున్నారు. దానికి ఆయన చెప్పే కారణాలు ఆయన చెబుతున్నారు.
బీజేపీ ఎవరి కోసం రేసులో వెనుకబడింది ?
పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించి రాజకీయంగా ఆత్మహత్య చేసుకుందని రేవంత్ రెడ్డి చాలా సార్లు అన్నారు. బీజేపీ గెలిచిన అన్ని చోట్లా బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. అలాంటిది ఇప్పుడు జూబ్లిహిల్స్ లో తాను డిపాజిట్ కోల్పోయేందుకు బీజేపీ వెనుకడుగు వేస్తోందని రేవంత్ అనుమానిస్తున్నారు. బండి సంజయ్ ప్రచారం కొనసాగించి ఉంటే.. హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్లుగా రాజకీయాలు మారిపోయేవి. అప్పుడు పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగేది.కానీ బీఆర్ఎస్ ను రేసులోకి తీసుకువచ్చేందుకు బీజేపీ వెనుకడుగు వేసిందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే బీజేపీ వ్యూహం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తోందన్న ప్రచారం మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోతో్ంది.
