జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన సోదరుడు రమేష్ యాదవ్ లను పోలీసులు బైండోవర్ చేశారు. వీరిద్దరూ పేరు మోసిన రౌడీషీటర్లు. పోలీసు రికార్డుల్లో వీరి పేర్లు ఉండటంతో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బైండోవర్ చేశారు. బైండోవర్ అంటే.. ఎన్నికలు, ఇతర కీలకమైన సందర్భాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిని ఆర్డీవో ముందు హాజరు పరిచి.. ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమని రాతపూర్వకంగా హామీ తీసుకుంటారు. ఉల్లంఘిస్తే వెంటనే అరెస్టు చేయవచ్చు.
నవీన్ యాదవ్ పై ఎలాంటి రౌడీషీట్ లేదు. కానీ చిన్న శ్రీశైలం యాదవ్ చాలా కాలం పాటు జూబ్లిహిల్స్ ఏరియాను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రభావం తగ్గిపోయింది. ఇటీవలి కాలంలో ఆయన నేరాలు చేసినట్లుగా.. రౌడీయిజం చేసినట్లుగా ప్రచారం జరగలేదు. శ్రీశైలం యాదవ్ కు టిక్కెట్ ఇవ్వడానికి చాలా పార్టీలు వెనుకంజ వేశాయి కానీ ఆయన మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నించేవి.
నవీన్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వడంతో.. బీఆర్ఎస్ పార్టీ రౌడీల గురించి ఎక్కువ హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తోంది. నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో అంతా రౌడీలే పాల్గొన్నారని అంటున్నారు. వారిని గెలిపిస్తే.. చిన్న చిన్న టిఫిన్ బండ్లను కూడా వదిలి పెట్టరని నెలవారీ మామూళ్లు వసూలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు భయపెడుతున్నారు. అయితే తాము పేదలకు అండగా ఉంటామని.. ఆ విషయం జూబ్లిహిల్స్ లో ఉండే పేదలందరికీ తెలుసని .. నవీన్ యాదవ్ అంటున్నారు.