జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు ముస్లింల జపం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ముస్లింలను పాంపర్ చేసి వారి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం వారికి వ్యతిరేకంగా హిందువుల్ని ఏకం చేసి గెలవాలని అనుకుంటోంది. ముఖ్యంగా బండి సంజయ్ ఈ దారిలో వెళ్తున్నారు. ప్రచారాన్ని చేతుల్లోకి తీసుకున్న కిషన్ రెడ్డి మాత్రం అలాంటి రాజకీయాలు చేయడం లేదు.
ముస్లింల ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ
ముస్లిం వర్గాలకు తాము మేలు చేశామంటే..తాము మేలు చేశామని పోటీ పడి మరీ .. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నాయి. ఎందుకంటే లక్షకుపైగా ఉన్న ముస్లిం ఓటర్లు.. అది కూడా ఓపికగా ఓట్లు వేసే వాళ్లు ఉన్నారు. వారి మద్దతు ఉంటే గెలుపు సాధ్యమవుతుంది. సాధారణంగా ముస్లింలంటే కాంగ్రెస్ సపోర్టర్లు. ఇప్పుడు ఎంఐఎం కూడా కలసి వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వారి మధ్యకొంత అయినా చీలిక తేవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఓట్లను గణనీయంగా పొందాలని అనుకుంటోంది.
ముస్లింలను బూచిగా చూపిస్తున్న బండి సంజయ్
బండి సంజయ్ ఎప్పుడు ప్రచారానికి వచ్చినా.. హిందూ వర్సెస్ ముస్లిం తీసుకు వస్తారు. జూబ్లిహిల్స్ లో అన్ని పార్టీలు ముస్లింలను పాంపర్ చేస్తున్నప్పుడు అలాంటి అవకాశాన్ని ఆయన వదులుకోరు. బోరబండసభలో ఆయన ప్రసంగం వింటే ముస్లింలకు కడుపు మండిపోతుంది. హిందూ వాదులు కూడా.. ఆలోచిస్తారు. ఇతర పార్టీలు ముస్లింల కోసం ఆలోచిస్తూ.. బండి సంజయ్ .. బీజేపీ మన కోసం ఉన్నారని అనుకుంటారు. ఇలా ఓ నాలుగైదు శాతం మార్పు తెచ్చినా తేడా భారీగా ఉంటుంది. ముస్లింలు చీలిపోయే అవకాశాలు ఉంటే.. బండి సంజయ్ మాటలు ఆపేస్తాయి. కాంగ్రెస్ వైపు గుంపగుత్తగా మారేలా చేస్తాయి.
జూబ్లిహిల్స్ ప్రజలకు ఈ రాజకీయాలపై ఆసక్తి ఉందా ?
నిజానికి జూబ్లిహిల్స్ ప్రజలకు ఈ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. అన్ని పార్టీలు సొంత సెటప్‌లతో రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ఎవరి పని వారు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల హడావుడిని చూసి వారు పెద్దగా వాతలు పెట్టుకోవాలనుకోవడం లేదు. ఎంత ఓటింగ్ నమోదు అవుతుంది.. ఏ ఏరియాల్లో నమోదు అవుతుందన్నది ఫలితాలకు కీలకం అనుకోవచ్చు.
