మరో వారం గడిచింది. ప్రధాన పత్రికలన్నీ తమ అనుబంధాల్లో కొత్త కథలు మోసుకొచ్చాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు పత్రికల్లో మెరిసిన కొత్త కథలు ఇవి. ఐదు కథలూ వేర్వేరు నేపథ్యాల్ని, పాయింట్లనీ ఆవిష్కరించడంతో ఈ కథల్లో కాస్త వైవిధ్యం కనిపించింది. కొన్ని కథలు అతి సాధారణమైన పాయింట్లనే ఎత్తుకొన్నాయి. కానీ కథనంలో వేగం ఉండడంతో చదవడానికి ఇబ్బంది రాదు. కథ చదివాక.. మనల్ని వెంటాడకపోయినా, చదివిన ఆ కాసేపూ ఏదో ఓ ఆలోచన రేకెత్తిస్తుంది. మరి ఆ కథలేంటో, కథా వస్తువులేంటో ఓసారి పరికిస్తే…?!
కథ: పరిష్కారం
రచన: ముచ్చి ధనలక్ష్మి
పత్రిక: ఈనాడు
మొహమాటానికి మించిన రోగం లేదు. కాస్త మెత్తగా ఉన్నామంటే – మనమీదే పెత్తనం చెలాయించడానికి చూస్తుంటారంతా. ఈ కథలో నళినిదీ అదే బాధ. తనకు భలే మొహమాటం. దాన్ని ఆసరాగా తీసుకొని పక్క ఫ్లాట్ లో ఉన్న సుజాత నళినిని తెగ వాడేసుకొంటుంది. ఆ మొహమాటం నుంచి నళిని ఎలా బయటపడింది? సుజాతని ఎలా కంట్రోల్ చేసింది అనేదే ‘పరిష్కారం’ కథ. ఇందులో పెద్దగా మలుపులేం ఉండవు. అబ్బుర పరిచే కథన శైలి, శిల్పం కనిపించవు. కాకపోతే… మన పక్కింట్లోనో, పక్క వాటాలోనో సుజాత లాంటి వాళ్లు ఉంటే, వాళ్లని ఎలా దార్లో పెట్టాలన్న కిటుకు మాత్రం ఉంది. నగర వాసులకూ, ముఖ్యంగా మొహమాట దాసులకూ ఓ ‘పరిష్కారం’ కనిపించే అవకాశం ఉంది.
కథ: ఫొటోగ్రాఫర్
రచన: ఈశ్వర చంద్ర
పత్రిక: సాక్షి
స్మార్ట్ ఫోన్‌పై కోపం పెంచుకొన్న ఓ ఫొటోగ్రాఫర్ కథ ఇది. స్మార్ట్ ఫోన్ వచ్చాక జీవితాల్లో వేగం పెరిగింది. కానీ.. కొన్ని వృత్తులు, ఆ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు మాత్రం రోడ్డున పడ్డాయి. ఈ కథలో ఫొటోగ్రాఫర్ బాధ కూడా అదే. ”There’s more to life that meets the camera eye” అనే క్యాప్షన్‌తో ఈ కథ మొదలవుతుంది. దానికి అర్థం తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది. కథకుడు చెప్పాలనుకొన్న పాయింట్, చివర్లో ట్విస్ట్ బాగున్నాయి. కాకపోతే… స్మార్ట్ ఫోన్లపై కోపంతో స్మార్ట్ ఫోన్‌ని దొంగతనం చేయాలనుకొన్న ఉద్దేశ్యంలో బలం లేదు. పైగా ఓ కొరియర్ బోయ్ తాను ఇవ్వాల్సిన పార్శిల్ మరోకరితో పంపించడంలోనూ లాజిక్ లేదు.
కథ: ఆకుపచ్చ ప్రపంచం
రచన: కె.వి.రమణారావు
పత్రిక: ఆంధ్రజ్యోతి
”మనిషంటే ఏ సూత్రాలకూ లోంగని వాడేమో” – అనే వాక్యం ఉంది ఈ కథలో. జీవితాన్ని అందరూ ఒకొక్క కోణంలో చూస్తుంటారు. ”ఇదే జీవితం.. ఇలానే జీవించాలి” అనే రూల్ లేదు. కాకపోతే… పరిస్థితులకూ, వాతావరణానికీ కట్టుబడి బతికేయడం నేర్చుకోవాలి. మన దేశం ఒకలా బతకమంటుంది. అమెరికా వెళ్తే.. అక్కడ మరో థియరీ! ఈ రెండు పద్ధతుల మధ్య జరిగిన ఘర్షణ… ఈ కథ. విచ్చలవిడితనం కాదు, బాధ్యతాయుతమైన స్వేచ్ఛ అవసరం, అలానే బతకాలి అని చెప్పిన కథ ఇది. చదివితే రచయిత మనసుని అర్థం చేసుకోవొచ్చు. కథలో అమెరికా వాతావరణాన్ని, అక్కడ జీవితాన్ని వర్ణించిన విధానం బాగుంది.
కథ: ఆలంబన
రచన: ఎస్వీకే సంహితానాయుడు
పత్రిక: నమస్తే తెలంగాణ
మనిషికి స్వాంతన అవసరం, బాధలో ఓదార్పు అవసరం. కన్నీటిని తుడిచే చేయి అవసరం. అది ఏ వయసులో వాళ్లకైనా. ఈ సమాజం పెట్టే నియమాల్ని, ఆంక్షల్నీ గౌరవించాలి. ఎంత వరకూ అంటే… మన గౌరవానికీ, స్వేచ్ఛకూ, ఇష్టాలకూ భంగం కలగనంత వరకూ. అదే జరిగితే – ఈ లోకాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఈ కథలో ఓ జంట అదే చేసింది. సమాజం, ఇల్లూ, చుట్టాలూ ఏమనుకొన్నా సరే – వాళ్ల గమ్యాన్ని వాళ్లే వెదుక్కొన్నారు. అదేంటి? అనేది ఈ కథ చదివితే తెలుస్తుంది.
కథ: తొడుగు
రచన: మణి వడ్లమాని
పత్రిక: వెలుగు
పులి వేటాడుతుంది. చంపుకుతింటుంది. అది ఆటవిక న్యాయం. మరి మనుషులేం చేస్తున్నారు? వాళ్ల వేటకు అర్థం ఉందా? ‘తొడుగు’లో రచయిత్రి వేసిన ప్రశ్న ఇదే. బెంగాల్ లోని సుందరబన్స్ దీవుల్లో రాయల్ బెంగాల్ టైగర్ ని చూడాలన్న ప్రయాణంతో ఈ కథ మొదలవుతుంది. పులికంటే క్రూరమైన వాళ్లు చుట్టూ ఉన్నారన్న సంకేతంతో ముస్తుంది. పాఠకులకు ఓ కొత్త ప్రదేశంలోకో, కొత్త ప్రపంచంలోకో తీసుకెళ్లాలనుకొన్నప్పుడు అక్కడి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాల్సిందే. అక్షరాల్లో ఆ అనుభూతిని పంచాల్సిందే. ఈ కథలో అలాంటి శిల్పానికి అవకాశం ఉంది. కానీ రచయిత్రి వర్ణనలకంటే, సందేశం చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది.
– అన్వర్