సమ్మర్ అంటే సినిమాల సీజన్. కానీ ఈ సమ్మర్ ఎలాంటి హంగామా లేకుండా డల్‌గా సాగింది. ఒక్క పెద్ద హిట్ కూడా ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఐపీఎల్ క్రమంగా సమ్మర్‌ను డామినేట్ చేస్తోంది. అదే సమయంలో ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకొచ్చే పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం కూడా ఒక కారణం. అయితే ఈ సమ్మర్‌కు ఫైనల్ టచ్ ఇవ్వడానికి జూన్ రెడీ అయ్యింది. జూన్‌లో కొన్ని పెద్ద సినిమాలు రావడం వల్ల బాక్సాఫీసు కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూన్ 3న ఐపీఎల్ సందడి పూర్తవుతుంది. జూన్ 5 థియేటర్లో వినోదం పంచడానికి లోకనాయకుడు కమల్ హసన్ రెడీ అవుతున్నారు. ఆయన మణిరత్నం కలసి దాదాపు 37 ఏళ్లు తర్వాత చేసిన సినిమా థగ్ లైఫ్’. నాయకుడు లాంటి క్లాసిక్ హిట్ తర్వాత కమల్ – మణిరత్నంల కాంబో నుంచి వస్తున్న సినిమాలో శింబు, త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్ లాంటి ప్రముఖ తారాగణం వుంది. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా వుంది. పైగా ‘విక్రమ్’ తర్వాత ఆ స్థాయి ప్రచారంతో కమల్ ఈ సినిమాని జనాల్లోకి తీసుకోస్తున్నారు. నాయకుడు కంటే పెద్ద హిట్ అవుతుందని, ఈ సినిమాతో ప్రేక్షకులు రుణం తీర్చుకుంటానని స్వయంగా కమల్ చెప్పడం ఇంకా అంచనాలు పెంచుతోంది. నాయకుడు సినిమాకి ఒక కల్ట్ ఫాలోయింది వుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న థగ్ లైఫ్ కి పాజిటివ్ టాక్ వస్తే గనుక.. బాక్సాఫీసు దగ్గర మంచి నెంబర్లు చూసే అవకాశం పుష్కలంగా వుంది.
జూన్ 6 ‘గ్యాంబ్లర్స్’, ‘బద్మాషులు’ లాంటి చిన్న చిత్రాలు బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. గ్యాంబ్లర్స్ లో సంగీత్ శోభన్ హీరో. మ్యాడ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు సంగీత్. ఇప్పుడుసోలోగా వస్తున్నాడు. బద్మాషులు అంతా కొత్తవాళ్ళు చేసిన సినిమా. అయితే ఈ రెండు సినిమాలపై కూడా అంత బజ్ లేదు.
జూన్ 12 వెరీ స్పెషల్. పవన్ కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ వస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం చాలా వాయిదాలు పడుతూ చివరికి జ్యోతికృష్ణ దర్శకత్వంలో చిత్రీకరణ ముగించుకుని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇది పవన్‌కి తొలి పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. 17వ శతాబ్దం నాటి మొఘలుల పరిపాలనా కాలంలో జరిగే కథాంశంతో ముస్తాబైంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. పవన్ సినిమా అంటే అభిమానులు హంగామా ఏ రేంజ్ లో వుంటుందో చెప్పడానికి లేదు. పైగా ఈ సినిమా రిలీజ్ సమయంలోనే థియేటర్స్ బంద్ వివాదం నడవడం, స్వయంగా పవన్ ఆఫీస్ నుంచి ఓ సంచలన ప్రెస్ నోట్ రిలీజ్ కావడం, తర్వాత జరిగిన పరిణామాలు.. ఇవన్నీ వీరమల్లు కోసం ఎదురుచూసేలా చేశాయి. పవన్ కళ్యాణ్ పై మళ్ళీ సిల్వర్ స్క్రీన్ చూడాలని అభిమానులు ఎదురుచుస్తున్నారు. ఆ ఎదురుచూపులకు 12న తెరపడనుంది.
జూన్ 20న ‘కుబేర’గా వస్తున్నాడు ధనుష్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, రస్మిక మందన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శేఖర్ కమ్ముల కుబేర కోసం ఎంచుకున్న కంటెంట్, టేకింగ్ డిఫరెంట్ గా వుంది. ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. డబ్బు చుట్టూ సాగే కథని పాన్ ఇండియా ఆడియన్స్ కి సరిపడేలా తీర్చిదిదారు. శేఖర్ కమ్ముల ఏ కథని ఎంచుకున్నా సెన్సిబుల్ గా చెప్పడం ఆయన స్టయిల్. ఈ పాన్ ఇండియా సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే గనుక.. శేఖర్ కమ్ముల నుంచి ఇకపై వచ్చే సినిమాల స్కేల్ మరింతగా పెరిగే ఛాన్స్ వుంది. ఇదే రోజున ‘8వసంతాలు’ అనే మరో చిన్న చిత్రం కూడా థియేటర్లలోకి వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమిది. కుబేర లాంటి బిగ్ స్టార్స్ సినిమా ముందు ఈ సినిమా ఎంతలా ప్రభావం చూపిస్తుందో చూడాలి.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆధ్యాత్మిక, చారిత్రక అంశాల మేళవింపుగా ఈ సినిమాని రూపొందించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి అగ్రతారలు ఇందులో అతిథి పాత్రల్లో కనిపించడం మరో విశేషం. ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు విష్ణు. అటు మోహన్ బాబు కూడా విష్ణుకి తోడయ్యారు. అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. విష్ణు హీరో రేసులో చాలా వెనుకబడ్డాడు. ఆయన మళ్ళీ ట్రాక్ పై రావాలంటే ఓ విజయం కావాలి. మరి ఆ విజయం కన్నప్ప ఇస్తుందో లేదో జూన్ 27న తేలిపోతుంది. మొత్తానికి జూన్ నెలలో స్టార్ వాల్యూ వున్న పెద్ద సినిమాలే వస్తున్నాయి. సమ్మర్ లో ఓ పెద్ద హిట్ రాలేదని లోటు వుంది. మరి ఆ లోటుని భర్తీ చేసే సినిమా ఏమిటో, జూన్ బాక్సాఫీసు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.