గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్. జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ రోజు ట్రైలర్ వదిలారు. కథని దాదాపు ట్రైలర్లోనే పరిచయం చేశారు.
అభి (కిరీటి) లేకలేక కలిగిన సంతానం. తల్లిదండ్రులు చాలా గారభంగా పెంచుతారు. కాలేజీలో చేరి శ్రీలీలను ప్రేమిస్తాడు. ఈ రోజు సరదాగా గడిచిపోతే చాలు అనుకునే క్యారెక్టర్ తనది. వీలైనన్ని జ్ఞాపకాలని పోగేసుకోవాలనే తాపత్రయం. సరదాగా గడిచిపోతున్న అభికి తన తండ్రి డ్రీమ్ గురించి తెలుస్తుంది. ఆయన పడుతున్న కష్టాలు తెలుసుకుంటాడు. తన తండ్రి కల కోసం ఏం చేశాడనేదే మిగతా కథ.
యూత్‌కి నచ్చే ఎలిమెంట్స్‌తో పాటు తండ్రి కొడుకుల బంధాన్ని బలంగా చూపించే ప్రయత్నం ట్రైలర్లో జరిగింది. కాలేజ్ కామెడీ ఓకే అనిపించింది. శ్రీలీల గ్లామర్‌ను యాడ్ చేసింది. కిరీటి స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. జెనీలియా పాత్ర ఏమిటనేది సస్పెన్స్. సెంథిల్ కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. దేవిశ్రీ బీజీఎం యాప్ట్‌గా ఉంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది. సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.