కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను రెడీ చేసింది. ప్రాజెక్టును ఆలోచన చేసినప్పటి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయే వరకూ జరిగిన ప్రతి అంశంపైనా జస్టిస్ ఘోష్ కమిషన్ నిశిత పరిశీలన జరిపింది. ఈ ప్రాజెక్టులో కీలక నిర్ణయాల్లో పాలు పంచుకున్న అధికారులందర్నీ ప్రశ్నించింది. బాగా అవినీతికి పాల్పడిన వారు.. తెలియదు.. గుర్తు లేదు.. వంటి ఆన్సర్లు చెప్పినా వారిని వదిలి పెట్టలేదు. అలాంటి అతి తెలివి ప్రదర్శించాలనుకున్న ముగ్గురు ఉన్నతాధికారులు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. ఇంకా అనేక మంది ఏసీబీ రాడార్ లో ఉన్నారు.
కాళేశ్వరంలో లెక్కలేనంత అవినీతి జరిగిందని.. నిబంధనకు విరుద్ధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. చర్యలు తీసుకునేందుకూ సిద్ధమవుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఘోష్.. కేసీఆర్ సహా అందర్నీ ప్రశ్నించారు. హరీష్ రావును రెండు సార్లు ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారుల్ని రెండో సారి పిలిపించి మరీ ప్రశ్నించారు. అందుకే నివేదిక సమగ్రంగా ఉంటుందని.. ఎక్కడెక్కడ నిబంధనలు ఉల్లంఘించారు అనేది స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం అంశంపై కేబినెట్లో ఎలాంటి చర్చలు జరిగాయి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నదానిపై పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు అధికారికంగా ఇచ్చింది. ఈ కేబినెట్ నిర్ణయాల్లో కాళేశ్వరంపై నిర్ణయాలు లేకపోతే మాత్రం ఇంకా చాలా సీరియస్ అంశం అవుతుంది. ఉన్నాయా లేవా అన్నది రిపోర్టులోనే తేలనుంది.
జస్టిస్ ఘోష్ కమిషన్.. అవినీతి జరిగిందా లేదా అన్నది తేల్చదు. జరిగిన అవకతవకల గురించి మాత్రమే వెల్లడిస్తుంది. కమిషన్ నివేదికను కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత.. కాళేశ్వరంలో అవినీతిపై కొత్తగా సిట్ ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.