పాక్ లో ఇండియన్ పర్యాటకులు తిరగాలంటేనే భయపడుతారు. అలాంటిది పాక్ భద్రత సిబ్బంది నుంచి అతిథి మర్యాదలు ఊహించగలమా? కానీ, పాక్ కు గూడచర్యం చేస్తూ అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ లో కనివినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించారు. ఏకంగా ఏకే47 గన్ లతో పోలీసులు భద్రత కల్పించిన వీడియో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
పాకిస్తాన్ లో ఓ స్కాటిష్ యూట్యుబర్ తీసిన వీడియోలో జ్యోతి మల్హోత్రా కనిపించింది. అతను జ్యోతిని పలుకరిస్తూ.. తను స్కాటిష్ యూట్యుబర్ గా పరిచయం చేసుకున్నాడు. తాను ఇండియా నుంచి వచ్చానని చెప్తూ, మీరు పాక్ కు మొదటిసారి వచ్చారా? అతడిని జ్యోతి ప్రశ్నించింది. తాను ఐదుసార్లు వచ్చానని అతను సమాధానం ఇచ్చాడు. పాక్ ఆతిథ్యం ఎలా ఉందని జ్యోతిని ప్రశ్నించగా.. చాలా బాగుందని ఆమె ఆన్సర్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే అతనిని దాటేసి జ్యోతి మల్హోత్రాకు ముందుకు వెళ్లిపోయింది. ఆమెకు ఆరుగురు వ్యక్తులు నో ఫియర్ అని రాసి ఉన్న సాధారణ దుస్తుల్లో భద్రత కల్పించడం కనిపించింది. దీంతో షాక్ అయిన అతను.. ఆమెకు ఆరుగురు వ్యక్తులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని వీడియో ద్వారా ప్రశ్నించాడు.
అయితే, ఆమె చుట్టూ మరికొంతమంది టూరిస్టులు కూడా ఉన్నారు. దీంతో ఆ బృందానికి భద్రత కల్పించారా? లేదంటే జ్యోతికి మాత్రమే భద్రత కల్పించారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, జ్యోతి పాక్ కు గూడచర్యం చేయడంతో ఆమెను పాక్ ఇంటలిజెన్స్ అధికారులు కీలకమైన వ్యక్తిగా పరిగణించే ఈ భద్రత కల్పించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.