ప్రపంచంలో ఎప్పుడు..ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే శాంతిదూత కేఏ పాల్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇరాన్ పై అమెరికా ,ఇజ్రాయెల్ దాడులు.. తర్వాత ఇరాన్ ప్రతి దాడులతో అంతా అల్లకల్లోలం ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ముందుగా తాను దేశాధినేతలతో మాట్లాడానని యుద్ధం ఆగిపోతుందని వీడియోలు చేసే కేఏ పాల్ ఇంకా స్పందించలేదు.
ప్రపంచ శాంతి కోసం రాత్రింబవళ్లు తపించిపోయే గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అటు ఇరాన్, ఇటు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య క్షిపణులు బాణాలుగా మారుతూ అంతర్జాతీయంగా పెను ముప్పు పొంచి ఉన్న వేళ.. కేఏ పాల్ తన ట్రేడ్‌మార్క్ స్టైల్లో నేను ట్రంప్‌తో మాట్లాడాను, నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చాను, ఇరాన్ అధ్యక్షుడికి మెయిల్ పెట్టాను.. ఇక యుద్ధం ఆగిపోతుంది అని వీడియో రిలీజ్ చేస్తారని నెటిజన్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతి యుద్ధంలోనూ మధ్యవర్తిగా తానే ఉండాలని ఆశపడే పాల్, ఈసారి మాత్రం గల్ఫ్ చిచ్చుపై ఇంకా నోరు మెదపడం లేదు.
నిజానికి కేఏ పాల్ ఈ మధ్య కాలంలో తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. యుద్ధాలను ఆపడం కంటే తెలుగు రాష్ట్రాల్లో మేఘా కృష్ణారెడ్డిపై ఆరోపణలు ఎక్కుపెట్టడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల తమిళనాడులో శాంతి సభలు నిర్వహిస్తూ బిజీగా గడిపిన ఆయన, అక్కడ కూడా మేఘా సంస్థల వైఫల్యాల గురించి, అవినీతి గురించి మాట్లాడటమే తన ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నా, పాల్ మాత్రం ఇంకా మేఘా మబ్బుల్లోనే ఉండిపోవడంతో నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు.
