కేకే ఓకే అని చెప్పినా… కేసీఆర్ రైట్ రైట్ అన‌లేదా..?

ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చించ‌డానికి సిద్ధంగా ఉన్నాననంటూ తెరాస సీనియ‌ర్ నేత కే కేశ‌వ‌రావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, త‌మ స‌మ‌స్య‌లపై మాట్లాడేందుకు కేకే రాక‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు ఆర్టీసీ కార్మికులు సానుకూలంగా స్పందించారు. దీంతో ఢిల్లీలో ఉన్న కేకే హుటాహుటిన హైద‌రాబాద్ కి చేరుకున్నారు. వెంట‌నే చ‌ర్చ‌లు ప్రారంభ‌మైపోతాయి, స‌మ్మె స‌మ‌స్య‌ ఒక కొలీక్కి వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, కేకే వ‌చ్చినంత వేగంగా… సీఎం కేసీఆర్ నుంచి ఆర్టీసీతో చ‌ర్చ‌లు జ‌ర‌పండి అనే ఆదేశాలు రాక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయం అవుతోంది.

ఢిల్లీ నుంచి వ‌చ్చిన కేకే వెంట‌నే ప్ర‌గ‌తి భ‌వ‌న్ కి వెళ్లారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో క‌లిసి మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తే… ఆయ‌న అందుబాటులో లేరు. దీంతో రోజంతా త‌న ఇంట్లోనే కూర్చుని, ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఫోన్ వ‌స్తుందేమో అని ఎదురుచూశారు… రాలేదు. రోజంతా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఉన్న సీఎం కేసీఆర్, సాయంత్రం ఫామ్ హౌస్ కి బ‌య‌ల్దేరి వెళ్లిపోయారని స‌మాచారం. నిజానికి, మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి కేకే సిద్ధ‌ప‌డుతూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారంటే… ముఖ్య‌మంత్రి నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా అలాంటిది జ‌రిగి ఉండ‌దు అనే అంద‌రూ అనుకున్నారు! కేసీఆర్ కి చెప్ప‌కుండా ఇలాంటి స‌మ‌యంలో ఎవ్వ‌రూ సొంత ప్ర‌క‌ట‌న‌లు చెయ్య‌రు క‌దా. కానీ, రోజంతా సీఎం ఆదేశాల కోసం కేకే ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

త‌న నివాసంలో మీడియాతో కేకే మాట్లాడుతూ… త‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండ‌టం మంచి ప‌రిణామ‌మ‌నీ, అయితే ప్ర‌భుత్వం నుంచి త‌న‌కు ఆదేశాలు రావాల్సి ఉంద‌న్నారు. స‌మ్మె విష‌యంలో ప్ర‌భుత్వం ఎలా ఆలోచిస్తోందో త‌న‌కు ఇంకా తెలీద‌నీ, ఆ వైఖ‌రి తెలిస్తే త‌న వంతు ప్ర‌య‌త్నం మొద‌లుపెడ‌తా అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌కి ఇంకా ట‌చ్ లోకి రాలేద‌నీ, రాగానే ఆయ‌న‌తో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. ప‌రిస్థితులు చేజార‌క‌ముందు ప్ర‌భుత్వం నుంచి చ‌ర్చ‌ల ప్ర‌య‌త్నాలు మొద‌లుకావాల‌ని కేకే ఆకాంక్షించారు! కేకే స్పంద‌న ఇప్పుడు ఇలా ఉంది. మొన్న ఆయ‌న విడుద‌ల చేసిన లేఖ‌లో… వెంట‌నే రంగంలోకి దిగుతున్నా అనే సంసిద్ధ‌త క‌నిపించింది. కేసీఆర్ సూచ‌న మేర‌కే ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న చేశారు అనిపించింది. కానీ, తీరా హైద‌రాబాద్ కి వ‌చ్చాక‌… ఇంకా కేసీఆర్ ని క‌ల‌వలేదు, ప్ర‌భుత్వం ఏమ‌నుకుంటోందో తెలియాలీ, సీఎం ఆదేశిస్తే నేను చ‌ర్చ‌ల‌కు వెళ్తా అంటూ కాస్త నీర‌సంగా కేకే స్పందించారు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com