K-Ramp Movie Telugu Review
Telugu360 Rating: 2.25/5
దీపావళి బరిలో చివరి బ్యాట్స్మెన్ గా దిగాడు కిరణ్ అబ్బవరం. కే-ర్యాంప్ టీజర్ ట్రైలర్ లో ఒక యూత్ ఫన్ వైబ్ కనిపించింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. గత దీపావళికి ‘క’ లాంటి విజయాన్ని అందుకున్న అబ్బవరం మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేశాడా? కే-ర్యాంప్ పంచిన వినోదం ప్రేక్షకులని అలరించేలా ఉందా?
కుమార్ (కిరణ్ అబ్బవరం) బాగా రిచ్. తండ్రి కృష్ణ( సాయి కుమార్) కుమార్ ని కంటికి రెప్పలా చూస్తుంటాడు. కుమార్ చదువులో సున్నా. మందు తాగడమే తన పని. తనకున్న పలుకుబడితో కుమార్ ని కేరళలోని ఓ కాలేజ్ లో చేర్పిస్తాడు కృష్ణ. అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) పరిచయమౌతుంది. తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. మెర్సీకి ఒక మానసిక రుగ్మత వుంటుంది. ఆ రుగ్మత గురించి తెలుసుకున్న కుమార్ షాక్ అవుతాడు. ఇంతకీ ఏమిటా కండీషన్ ? మెర్సీకి వున్న ఆ సమస్య కారణంగా కుమార్ ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? ఈ ప్రేమ కథ చివరికి ఏమైయింది?
ప్రామిస్ ని బ్రేక్ చేస్తే భరించలేని ఓ అమ్మాయికి, అసలు జీవితమంటే లెక్కని ఓ అబ్బాయికి మధ్య జరిగే కథ ఇది. ఇలా ఫ్రేం చేస్తే లైన్ బాగానే వుంది. కానీ ఈ కథని దర్శకుడు డీల్ చేసిన విధానం చూస్తే పరమ రొటీన్, జనరిక్ గా అనిపిస్తుంది. సినిమా మొదలైన నలఫై నిమిషాల వరకూ సన్నివేశాలు ఎటు దారితీస్తుంటాయో అంతుచిక్కదు. పోనీ కథతో సంబంధం లేకుండా నవ్వించే సీన్స్ పడ్డాయా? అదీ లేదు. అన్నీ ఫోర్స్ ఫుల్ గా వుంటాయి. కిరణ్ అబ్బవరం ఎదో ఎనర్జిటిక్ గా కదులుతుంటాడు కానీ రైటింగ్ లో కొత్తదనం వుండదు.
ఎంత కమర్షియల్ సినిమా అయినా చిటికెడు సహజత్వం అవసరం. కొంచెమైన బిలివబులిటీ వుండాలి. కే-ర్యాంప్ ఒక్క చోట కూడా అర్గానిక్ గా అనిపించదు. అసలు ఈ కథని కేరళకి ఎందుకు షిఫ్ట్ చేశారో పాయింట్ వుండదు. పోనీ అక్కడ కల్చర్ లో తీశారా ? అదీ లేదు. డైలాగులు చెప్పే నటీనటులు అంతా తెలుగు వాళ్ళే. చివరికి కేరళలో పరిచయమైన ఫ్రెండ్స్ కూడా స్వచ్చమైన తెలుగు మాట్లాడుతుంటారు. ఆ సీన్లు అన్నీ చూస్తున్నప్పుడు.. ఈ కథని చక్కగా హైదరాబాద్ లో తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది.
కథ, కథనం గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ వుండదు. హీరోయిన్ రుగ్మత బయటపడటం ఇంటర్వెల్ సీన్, ఆ తర్వాత ఏంజరుగుతుందో అక్కడే ప్రేక్షకుడు ఊహిస్తాడు. దానికి తగ్గట్టుగానే జరుగుతుంది. దర్శకుడు సెకండ్ హాఫ్ లో ప్రేమకథ వర్క్ అవుతుందని నమ్మాడు. కానీ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఏ మాత్రం పండలేదు. దీంతో ఆ ట్రాక్ అంతా వీక్ అయ్యింది. చివరికి చాట్ జీపిటీ సాయంతో శుభం కార్డు వేశారు. ఆ రైటింగ్ చూశాక కనీసం పెయిడ్ వెర్షన్ ఛాట్ జిపీటీలో ఈ స్క్రిప్ట్ వేసుకుంటే.. ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చేదనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇందులో చెప్పుకోదగ్గ అంశాలు ఏమిటంటే.. కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ గా కనిపించాడు. తన టైమింగ్ బావుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కొన్ని నవ్వించే సీన్స్ వుంటాయి. హాస్పిటల్ ఎపిసోడ్ లో తన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా వుంటుంది. యుక్తి తరేజా క్యారెక్టర్ తేలిపోయింది. నరేష్ ది బిగినింగ్ లో కాస్త ఇన్ డీసెంట్ గా అనిపించే క్యారెక్టర్. ఫన్ రాకపోగా కాస్త చిరాకు పెట్టింది. అయితే చివర్లో దానికి మెసేజ్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ కాసేపు నవ్విస్తాడు. అలీ, శ్రీనివాస్ రెడ్డి కథని నరేట్ చేసే పాత్రల్లో కనిపించారు. సాయి కుమార్ తన అనుభవం చూపించారు. ఐతే ఆ పాత్రలో ఎమోషనల్ గా వర్క్ అవుట్ కాలేదు. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన ఓనం సాంగ్ హుషారుగా వుంది. నేపధ్య సంగీతం చేయడానికి తనకి పెద్ద అవకాశం దక్కలేదు. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. గుర్తుపెట్టుకునే మాటలైతే లేవు.
వినోదంవుంటే చాలు కథ అవసరం లేదనే ధీమాతో తీసిన సినిమా ఇది. నిజంగానే కొన్ని సినిమాలకి ఈ సూత్రం పని చేసింది. అయితే వినోదం పేరు రొటీన్ ట్రీట్మెంట్ తో పాత జోకులు వేస్తె జనం నవ్వే రోజులు పోయాయి. కే-ర్యాంప్ కూడా ఓ పాత జోకులానే తయారైయింది.
Telugu360 Rating: 2/5