పశ్చిమాసియా తగలబడిపోతూంటే కేఏ పాల్ ఎక్కడికి పోయారన్న ప్రచారం .. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఆయన ఆషామాషీగా రావాలనుకోలేదు.. బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్లుగా వచ్చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుని ప్రత్యేక ప్రతినిధి ఆయతుల్లా అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి .. కేఏ పాల్ కు ప్రత్యేకంగా ఆతిధ్యం ఇచ్చారు. కేఏ పాల్ శాంతి ప్రయత్నాలకు ఆయన అంగీకరించి యుద్ధ విరమణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దాంతో తాను శాంతి చర్చలు జరుపుతున్నందున 72 గంటల పాటు యుద్ధ విరమణకు కట్టుబడి ఉండాలని అమెరికా నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌ను, ఇజ్రాయెల్ నాయకులను పాల్ కోరారు.
ఇరాన్‌కు పాల్ ఎలా వెళ్లారో కానీ.. వెళ్లినట్లుగా.. అక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి తనకు ఆతిధ్యం ఇచ్చినట్లుగా పాల్ చెప్పుకున్నారు. తన పిలుపునకు స్బందించి ట్రంప్, నెతన్యాహు 72 గంటల పాటు విరామం ఇస్తే దౌత్యపరమైన చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనవచ్చని, మరింత ప్రాణనష్టం జరగకుండా ఆపవచ్చని పాల్ అంటున్నారు. అయితే పాల్ పాత ఫోటోను వెదుక్కోవడానికి ఇంత కాలం పట్టిందని ఆ ఫోటోతోనే తానేదో ఇరాన్ వెళ్లినట్లుగా ట్వీట్ చేస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
గతంలో యొమన్ లో కేరళకు చెందిన ఓ నర్సుకు ఉరి శిక్ష పడింది. ఆ శిక్షను తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తూంటే ఆయన కూడా యొమన్ వెళ్లి చర్చలు జరిపారు. అక్కడి హౌతి రెబల్స్ చేతిలో శిక్ష అంశం ఉండటంతో కేంద్రం అతి కష్టం మీద శిక్షను ఆపగలిగింది. దానికి పాల్.. తన వల్లే శిక్ష ఆగిందని ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎప్పుడు ఆగినా.. తన వల్లే ఆగిందని ఆయన చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
