కడప మేయర్ స్థానానికి పదకొండో తేదీన ఎన్నిక జరగనుంది. మేయర్ ఎన్నిక నిర్వహణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ మేయర్ ఎన్నిక కోసం ఉత్తర్వులు జారీ చేయడంతో, జాయింట్ కలెక్టర్ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం డిసెంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటలకు కడప కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. కానీ ఎన్నిక వద్దని వైసీపీ అంటోంది. కోర్టుకెళ్లింది.
మేయర్ పదవి కాలం మరో ఐదు నెలలే
మేయర్ గా ఉన్న సురేష్ బాబు అక్రమాలకు పాల్పడటంతో ఆయనను పదవి నుంచి తొలగించారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్ఛార్జ్ మేయర్‌గా నియమించారు. ఆమె కూడా వైసీపీకి చెందిన వారే. పాలకవర్గం పదవీ కాలం మరో ఐదు నెలల్లో ముగియనుంది. కడప నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించడం తప్పనిసరి. పాలనా అవసరాల దృష్ట్యా కడప మేయర్‌ను ఎన్నుకోవడం అనివార్యం కావడంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు మేయర్ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేతలు
ఎన్నికల కమిషన్ కడప మేయర్ ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ వైసీపీ కోర్టుకెళ్లింది. మాజీ మేయర్ సురేష్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను మేయర్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేశారు. అలాగే మేయర్ ఎన్నిక నిర్వహించవద్దని ఆయన అంటున్నారు. నిజానికి ఆయనపై గతంలోనే వేటు వేస్తే ఓ సారి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకున్నారు . కోర్టు మార్గదర్శకాల ప్రకారం మరోసారి అనర్హతా వేటు వేశారు. అయినా ఆయన మరోసారి కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టు డిసెంబర్ 9న విచారణ జరపనుంది. హైకోర్టు తీర్పు తరువాత కడప మేయర్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనే దానిపై స్పష్టత వస్తుంది.
ఎన్నిక జరిగినా గెలిచేది వైసీపీ మేయరే
ఇక్కడ వైసీపీ ఎందుకు టెన్షన్ పడుతుందో కానీ కడప కార్పొరేషన్ లో ఇప్పటికీ వైసీపీకే పూర్తి మెజార్టీ ఉంది. టీడీపీ కూడా ఆకర్ష్ ప్రయోగించి ఐదు నెలల మేయర్ పీఠాన్ని అందుకోవాలని అనుకోవడం లేదు. కానీ కార్పొరేటర్లపై వైసీపీ నాయకత్వానికి ముఖ్యంగా మేయర్ సురేష్ బాబుకు నమ్మకం లేకపోయింది. టీడీపీలో చేరకపోయినా.. ఎవరో తమకు ఇష్టం వచ్చిన వారిని మేయర్ గా ఎంపిక చేసుకుని .. తమ గ్రిప్ లో నుంచి బయటకు పోతారని అనుకుంటున్నారు. అదే జరిగితే జగన్ రెడ్డి పరువు మరోసారి పోతుంది. అందుకే లంచ్ మోషన్స్ వేసి మరీ మేయర్ ఎన్నికను అడ్డుకోవాలనుకుంటున్నారు.
