ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె పరిసరాల్లో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి, సుమారు 3 వేల ఎకరాలకు పైగా భూమిని జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దశాబ్దాలుగా రాయలసీమ ప్రజల కలగా ఉన్న ఈ ఉక్కు పరిశ్రమ సాకారం కావడానికి ఈ భూముల బదిలీ ఒక ప్రధాన మలుపుగా భావిస్తున్నారు.
గతంలో ఈ ప్రాజెక్టు కోసం వివిధ సంస్థలతో చర్చలు జరిగినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉక్కు ఉత్పత్తి చేసేందుకు జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్ ద్వారా ఏటా దాదాపు 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిందాల్ సంస్థ సుమారు రూ. 8,883 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. భూమి అప్పగింత ప్రక్రియ పూర్తి కావడంతో, ఇక ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.
ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకోవడమే కాకుండా, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన కడప జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా వెలిసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీరు, విద్యుత్ రహదారి సౌకర్యాలను కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.
భూసేకరణ సమయంలో స్థానిక రైతుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, పరిహారం పంపిణీ వంటి అంశాలను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించింది. వైసీపీ హాయంలో శంకుస్థాపన జరిగినప్పటికీ.. భూ సమస్యలను పరిష్కరించకపోవడంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ప్రభుత్వం అన్నీ పరిష్కరిస్తోంది. జిందాల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టడం వల్ల నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని అటు రాజకీయ వర్గాలు, ఇటు పారిశ్రామిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పారిశ్రామిక ముఖచిత్రంలో కడప స్టీల్ ప్లాంట్ ఒక మైలురాయిగా నిలవనుంది.
