కథానాయికగా కొంతకాలం రాజ్యమేలిన తరవాత, స్టార్ డమ్ అంతా అనుభవించాక, అన్ని రకాల కమర్షియల్ సినిమాలూ చేసేశాక చివరికి లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై మనసు మళ్లుతుంటుంది. కెరీర్ చివరి దశలో మంచి నటి అనిపించుకోవాలన్న ఆత్రం ఎలానూ ఉంటుంది. అందుకే నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు అప్పుడప్పుడూ టాలీవుడ్ తలుపు తడుతుంటాయి. దాదాపు అగ్ర కథానాయికలంతా ఎప్పుడో ఒకప్పుడు ఈ తరహా చిత్రాలపై దృష్టి పెట్టినవాళ్లే. అయితే కాజల్ మాత్రం ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నమేం చేయలేదు. కారణమేంటి అని అడిగితే…. నాయకా ప్రాధాన్యం ఉన్న సినిమాల్ని క్యారీ చేసేంత సత్తా తనకు లేదని క్లారిటీగా చెప్పేస్తోంది కాజల్. కమర్షియల్ సినిమాలు చేసుకొంటూ వెళ్లడంలో ఉన్నంత సుఖం మరెందులోనూ ఉండదని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది కాజల్.
”కమర్షియల్ సినిమాల్లోనే కాస్త కొత్త దారి వెదుక్కోవడం బెటర్. నాకైతే అలాంటి సినిమాలు చేయడంలోనే ఆనందం దొరుకుతుంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. నాపై నాకు నమ్మకం ఉంటే సరిపోదు. నన్ను మిగిలినవాళ్లంతా నమ్మాలి. సినిమా అంటే పెద్ద ఎత్తున చేసే వ్యాపారం. దాంతో ప్రయోగాలు చేస్తూ కూర్చోలేం. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసి విజయాలు సాధించినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ నాకే అంత సీన్ లేదనిపిస్తోంది” అంటూ బోల్డ్‌గా స్టేట్ మెంట్ ఇచ్చింది కాజల్. సో… కాజల్ నుంచి ఆ తరహా సినిమాలొచ్చే అవకాశమే లేదన్నమాట.