కాళేశ్వరం కమిషన్ మరోసారి హరీష్ రావును పిలిచింది. మంగళవారమే ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కేబినెట్ లో ..కాళేశ్వరం గురించి తీసుకున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం.. ప్రభుత్వం నుంచి జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్కు అందింది. గతంలో పలుమార్లు లేఖలు రాసిన తర్వాత కేబినెట్ లో చర్చించిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ అడిగిన వివరాలు ఇవ్వాలని నిర్ణయించింది.
కేసీఆర్ హయాంలో కాళేశ్వరం అంశంపై కేబినెట్లో జరిగిన చర్చల వివరాలు, తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్థాయిలో వివరాలు అందించారు. ఈ వివరాలతో.. గతంలో హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లు సరిపోలలేదని తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత తీసుకునేందుకు హరీష్ రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే మాజీ ఈఎన్సీ అనిల్ కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని తెలియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది.
కేసీఆర్ దగ్గర కూడా.. కాళేశ్వరం కమిషన్ వాంగ్మూలం నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి అందిన రికార్డుల ప్రకారం.. తేడాగా స్టేట్ మెంట్లు ఇచ్చిన వారి నుంచి మరోసారి వాంగ్మూలం తీసుకుని తుది రిపోర్టును నెలాఖరులోగా ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించనుంది. ఆ నివేదికను కెబినెట్లో చర్చించి..తదుపరి చర్యలు తీసుకుంటారు. అప్పుడు రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.